- ఆగస్టు 14లోగా భూ రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోకి
- పీఓబీ దరఖాస్తులను నేరుగా కలెక్టర్లకే పంపాలని ఆదేశం
- సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలకు చెక్ పెట్టనున్న ప్రభుత్వం
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : నిషేధిత ఆస్తుల జాబితా–22ఏ, పీఓబీలో భూములు ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. చట్టబద్ధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. 22ఏ పేరుతో పేదలు, నిజమైన హక్కుదారులకు అన్యాయం చేస్తే సహించబోమని అధికారులను హెచ్చరించారు. మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా వచ్చిన పీఓబీ దరఖాస్తులు, పెండింగ్ కేసులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
14లోగా రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోకి
భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి ప్రభుత్వం గతంలో జారీచేసిన జీవోలు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్ అనుమతులు సహా అన్ని పత్రాలను ఆగస్టు 14లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. దీనివల్ల అసలైన పత్రాలేవో, ఫోర్జరీ పత్రాలేవో గుర్తించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. మరింత పారదర్శకత కోసం పహాణీ వివరాలను కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని, గతం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

గుడ్డిగా రిజిస్ట్రేషన్ తిరస్కరిస్తే చర్యలు
పీఓబీ జాబితాలో ఆస్తి ఉందనే కారణంతో రిజిస్ట్రేషన్‌ను గుడ్డిగా తిరస్కరించవద్దని సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు. తిరస్కరించాల్సి వస్తే మూడు రోజుల్లో పరిశీలన పూర్తిచేసి, స్పష్టమైన కారణాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. ఇకపై పీఓబీ దరఖాస్తులను తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లకు అదనపు విచక్షణాధికారాలు ఉండకూడదని, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ధ్రువీకరించిన వివరాల మేరకే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో రాజీ ఉండదని, ఉద్దేశపూర్వకంగా తప్పుచేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.