- నల్లగండ్ల రోడ్డులో డ్రైనేజీ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశం
- ఊర్జిత్ విల్లాస్ వద్ద నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టీకరణ
- రాజపుష్ప రోడ్డులో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలపై సమీక్ష
సామాన్యుడి అస్త్రం / టెల్లాపూర్ : రోడ్లపై నీటి నిల్వ, దెబ్బతిన్న మార్గాలు, ప్రమాదాలకు ఆస్కారమున్న ప్రాంతాలపై శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్ అధికారులను అప్రమత్తం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్, పటాన్‌చెరు సర్కిల్‌లో గురువారం ఆయన విస్తృత క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. టెల్లాపూర్ వార్డులోని సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయడంతోపాటు తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా అవసరమైన చోట శాశ్వత పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు.
నల్లగండ్ల రోడ్డుపై నీటి నిల్వ
నల్లగండ్ల రోడ్డులోని ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో తరచూ నీరు నిలుస్తున్న ప్రాంతాన్ని జోనల్ కమిషనర్ పరిశీలించారు. వర్షం పడిన ప్రతిసారీ రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో కొత్త రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధంచేసి సమర్పించాలని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థను సరిచేయకుండా రోడ్డు నిర్మాణం చేపడితే మళ్లీ సమస్య తలెత్తే అవకాశమున్నందున రెండు పనులకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

ఊర్జిత్ విల్లాస్‌కు శాశ్వత పరిష్కారం
ఊర్జిత్ విల్లాస్ సమీపంలోని నీటి నిల్వ ప్రాంతాన్ని పరిశీలించిన నారాయణ అమిత్, అక్కడ ఇటీవల చేపట్టిన డ్రైనేజీ చర్యల పురోగతిని సమీక్షించారు. నీరు బయటకు వెళ్లే మార్గంలో ఉన్న ఆటంకాలను గుర్తించి, భవిష్యత్తులో సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ఆర్‌ఎంసీ ప్లాంట్ సమీపంలో భారీ వాహనాల రాకపోకలతో సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులపై వెంటనే ప్యాచ్‌వర్క్ చేపట్టి సురక్షిత ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని సూచించారు.
రాజపుష్ప రోడ్డులో ప్రమాదాలకు అడ్డుకట్ట
ప్రమాదాలు జరిగే అవకాశమున్న రాజపుష్ప రోడ్డులో జోనల్ కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలన నిర్వహించారు. ప్రస్తుత రోడ్డు పరిస్థితి, మలుపులు, వాహనాల వేగం, రాత్రివేళ దృశ్యమానత వంటి అంశాలను సమీక్షించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన రక్షణ చర్యలు, సూచిక బోర్డులు, వీధిదీపాలు, స్పీడ్ నియంత్రణ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యం, మెరుగైన రోడ్డు కనెక్టివిటీ కోసం వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నారాయణ అమిత్ స్పష్టం చేశారు. పౌర సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని కఠినంగా ఆదేశించారు. ఈ పర్యటనలో టెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్, వివిధ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.