- దెబ్బతిన్న సీవరేజ్ లైన్‌తో నాళాలోకి మురుగునీరు
- నాలా రిటైనింగ్ వాల్, సీసీ రోడ్లు, వీధిదీపాలకు నిధుల డిమాండ్
- అన్ని కాలనీ సంఘాలకు సమాచారం ఇవ్వలేదని అధికారుల దృష్టికి ఫిర్యాదు
సామాన్యుడి అస్త్రం / వివేకానంద నగర్ : ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిర్వహించిన ‘వన్ డే–వన్ వార్డ్’ కార్యక్రమంలో స్థానిక సమస్యలు ఒక్కసారిగా అధికారుల ముందుకొచ్చాయి. వివేకానంద నగర్ కాలనీ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి.సృజన, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి పాల్గొని ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు మాట్లాడుతూ వివేకానంద నగర్, వెంకటేశ్వర నగర్ డివిజన్లలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రెండు డివిజన్లకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించినప్పటికీ అన్ని కాలనీ సంక్షేమ సంఘాల నాయకులకు ముందస్తు సమాచారం అందలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను సమగ్రంగా గుర్తించేందుకు కాలనీ సంఘాలతోపాటు అన్ని రాజకీయ పార్టీల స్థానిక ప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు.
నాళాలోకి నేరుగా మురుగునీరు
ప్రధానంగా నాళాలో ఉన్న సీవరేజ్ లైన్ దెబ్బతినడంతో మురుగునీరు పూర్తిగా నాళాలోకి ప్రవహిస్తోందని అధికారులకు వివరించారు. దీనివల్ల చుట్టుపక్కల కాలనీల్లో భరించలేని దుర్వాసన వస్తోందని, ప్రజలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో కాజాకుంట సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ సామర్థ్యాన్ని 10 ఎంఎల్‌డీ నుంచి 20 ఎంఎల్‌డీకి పెంచినప్పటికీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం లేదని పేర్కొన్నారు. దెబ్బతిన్న సీవరేజ్ లైన్‌ను మరమ్మతు చేయడం లేదా కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయడం ద్వారా మురుగునీటిని పూర్తిగా ఎస్టీపీలోకి మళ్లించాలని కోరారు.

రిటైనింగ్ వాల్‌కు మోక్షమెప్పుడు?
ఆస్బెస్టాస్ కాలనీ సొసైటీ కార్యాలయం నుంచి కమల ప్రసన్న నగర్ పైప్‌లైన్ రోడ్డు బ్రిడ్జి వరకు నాళా వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ కూడా సక్రమంగా జరగడం లేదని సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ రెండు డివిజన్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు మంజూరు కాలేదని రంగారావు పేర్కొన్నారు. మెట్రో వాటర్ బోర్డుకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు మున్సిపల్ అధికారులు సమన్వయంతో నిధులు సమకూర్చాలని కోరారు.
కార్యక్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు డీజీఎం శ్రీనివాస్‌రాజు, కూకట్‌పల్లి జోన్‌కు చెందిన వివిధ విభాగాల అధికారులు, రెండు డివిజన్ల కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.