ASTHRAM DAILY
Hyderabad

వాసవి నిర్మాణాలపై వివాదాల మోత.. కోమటికుంట చెరువు రక్షణకు చర్యలేవి?

హైకోర్టు ఉత్తర్వుల తర్వాతా తేలని వివాదం.. అధికారుల జాప్యంపై ఆకుల సతీష్ ఫిర్యాదు

* చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగాయన్న ఆరోపణలపై చర్యలకు డిమాండ్

* హైడ్రా జాయింట్ సర్వే ప్రతిపాదనకు స్పందన కరవైందని ప్రజావాణిలో ఫిర్యాదు

* బాచుపల్లి సాయినగర్‌లో 11 గుంటల ప్రభుత్వ భూమి, కొంపల్లిలో ఆర్మీ భూమి పరిరక్షణకూ వినతులు

సామాన్యుడి అస్త్రం | బాచుపల్లి : చెరువులను కాపాడతామంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయి? కోర్టులను ఆశ్రయించినా, అధికారులకు ఫిర్యాదులు చేసినా చెరువు భూముల పరిరక్షణపై స్పష్టత రావడానికి ఇంకెంతకాలం పడుతుంది? బాచుపల్లిలోని కోమటికుంట చెరువు పరిధిలో వాసవి ఇన్‌ఫ్రాకాన్ నిర్మించిన 8, 9వ బ్లాకుల వ్యవహారం మరోసారి ఈ ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.

కోమటికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసవి సంస్థపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లినా వివాదానికి పూర్తిస్థాయిలో పరిష్కారం లభించలేదని, సంబంధిత శాఖల మధ్య సమన్వయ లోపంతో చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు.

 హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ఏం జరిగింది?

కోమటికుంట చెరువు పరిధిలోని నిర్మాణాలపై గతంలో హైకోర్టులో వ్యాజ్యాలు నడిచాయి. ముఖ్యంగా వాసవి ప్రాజెక్టుకు చెందిన 8, 9వ బ్లాకులు చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో ఉన్నాయా లేదా అన్న అంశం వివాదానికి కేంద్రబిందువైంది.

2024 జూలై 1న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉమ్మడి ఉత్తర్వుల్లో, 2023 డిసెంబర్ 21న నిర్వహించిన జాయింట్ సర్వే నివేదిక ఆధారంగా హెచ్‌ఎండీఏ తిరిగి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి నిర్మాణ నిలుపుదల ఉత్తర్వులను రద్దు చేసిన న్యాయస్థానం, నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా లేదా అన్న అంశంపై తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు.

అయితే ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ప్రస్తుత నిర్మాణాల చట్టబద్ధతపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆకుల సతీష్ డిమాండ్ చేస్తున్నారు. వివాదాస్పద హెచ్‌ఎండీఏ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని నిర్మాణ పనులు తిరిగి కొనసాగుతున్నాయన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరపాలని కోరారు.

జాయింట్ సర్వేపై ఎందుకీ జాప్యం?

చెరువు సరిహద్దులు, ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ పరిధిని నిర్ధారించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో హైడ్రా అధికారులు సంబంధిత శాఖలకు జాయింట్ సర్వే కోసం లేఖలు రాసినట్లు సతీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆశించిన స్పందన రాలేదని ఆరోపించారు.

చెరువు పరిధిలో నిర్మాణాలు ఉన్నాయన్న ఆరోపణలు ఒకవైపు, అనుమతులు ఉన్నాయన్న వాదనలు మరోవైపు కొనసాగుతున్న నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు సమన్వయంతో వ్యవహరించి వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.

 సాయినగర్‌లో 11 గుంటల ప్రభుత్వ భూమిని కాపాడాలి

బాచుపల్లి సాయినగర్‌లోని సర్వే నంబర్ 186లో సుమారు 11 గుంటల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించినట్లు సతీష్ మరో ఫిర్యాదులో పేర్కొన్నారు. గుర్తింపుతోనే సరిపెట్టకుండా ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆక్రమణలకు తావులేకుండా చూడాలని కోరారు.

ప్రభుత్వ భూములను కాపాడటమే కాకుండా వాటిని ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కాలనీల్లో కమ్యూనిటీ అవసరాలకు స్థలాలు కొరతగా మారుతున్న నేపథ్యంలో ఈ భూమిని ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కొంపల్లిలో ఆర్మీ భూమి సర్వే నివేదిక ఎక్కడ?

కొంపల్లిలోని సర్వే నంబర్ 100లో ఆర్మీ భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలపై నిర్వహించిన సర్వే నివేదికను ఇప్పటివరకు అందించకపోవడాన్ని సతీష్ ప్రశ్నించారు. సర్వే పూర్తయినా నివేదిక వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు.

సంబంధిత అధికారులు సర్వే నివేదికను అందుబాటులో ఉంచడంతో పాటు ఆక్రమణలు జరిగినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, రక్షణ శాఖ భూముల విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఫిర్యాదులతోనే సరిపెడతారా.. చర్యలు తీసుకుంటారా?

చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చట్టాలు ఉన్నా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు అందిన ప్రతిసారీ శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలతోనే సరిపెట్టకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు.

కోమటికుంట చెరువు నిర్మాణాల వివాదంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని, నిబంధనల ఉల్లంఘన ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రజలందరికీ చెందిన చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అరుణ్‌రావు, మాధవరావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక వాసవి 8, 9వ బ్లాకుల వ్యవహారంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సర్వే వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారు? అన్నది తేలాల్సి ఉంది. ఈ ఆరోపణలపై వాసవి సంస్థ, సంబంధిత అధికారుల తాజా స్పందన కూడా తెలియాల్సి ఉంది.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder