ASTHRAM DAILY
Hyderabad

కేపీహెచ్‌బీలో అయ్యప్ప స్వాముల అన్నసమారాధన ప్రారంభం.. స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్!

  • జనవరి 1 వరకు కొనసాగనున్న అయ్యప్ప స్వాముల అన్నసమారాధన
  • ముఖ్యఅతిథులుగా హాజరైన సినీ నటులు శ్రీకాంత్, ప్రభాకర్
  • తొలిరోజు అన్నదానానికి సహకరించిన జనసేన నేత ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

సామాన్యుడి అస్త్రం / కూకట్‌పల్లి: అయ్యప్ప నామస్మరణతో కేపీహెచ్‌బీ కాలనీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తి, సేవాభావం కలగలిసిన వాతావరణంలో అయ్యప్ప స్వాముల అన్నసమారాధన కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 2లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ కమిటీ కన్వీనర్ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌తో పాటు సినీ నటులు శ్రీకాంత్, ప్రభాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అయ్యప్ప స్వాముల నామస్మరణ మధ్య అన్నసమారాధనను ప్రారంభించారు.

స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన ప్రేమ్‌కుమార్

కార్యక్రమం తొలిరోజు అన్నదానానికి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ తనవంతు సహకారం అందించారు. అంతేకాకుండా స్వయంగా అయ్యప్ప మాలధారులకు అన్నప్రసాదం వడ్డించి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అయ్యప్ప స్వాములకు సేవ చేయడం ఎంతో పవిత్రమైన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. అన్నదానం ఆకలి తీర్చడమే కాకుండా మనుషుల మధ్య ప్రేమాభిమానాలను, సేవాభావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. స్వాముల ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


రెండు నెలల పాటు అన్నసమారాధన

నవంబర్ 1న ప్రారంభమైన ఈ అన్నసమారాధన కార్యక్రమాన్ని 2027 జనవరి 1 వరకు నిరంతరాయంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప మాలధారులకు అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. భక్తితో పాటు సేవకు ప్రాధాన్యమిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానికులు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, శ్రీనివాస గోవిందా, పాదం సూర్య, బండారి రమేష్, సుభాష్‌తో పాటు స్థానిక నాయకులు, అయ్యప్ప భక్తులు, పెద్ద సంఖ్యలో మాలధారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల సేవలో భాగంగా నిర్వహించిన అన్నసమారాధనతో కేపీహెచ్‌బీ కాలనీలో భక్తి వాతావరణం నెలకొంది.

Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder