Crime

మైన్స్‌ అధికారి ఇంట ‘ఆస్తుల గని’!.. రూ.3.06 కోట్లపై ఏసీబీ పంజా

మైన్స్‌ అధికారి ఇంట ‘ఆస్తుల గని’!.. రూ.3.06 కోట్లపై ఏసీబీ పంజా
  • వరంగల్‌, హైదరాబాద్‌ సహా ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
  • భవనం, ఫ్లాట్‌, ఐదు ప్లాట్లు, 629 గ్రాముల బంగారం గుర్తింపు
  • డ్రైవర్‌ ఖాతా నుంచి అధికారి కుమార్తె ఖాతాకు రూ.24.80 లక్షల బదిలీ
సామాన్యుడి అస్త్రం / వరంగల్ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో గనులు, భూగర్భశాఖ అధికారిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ, వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బొజ్జ జయరాజుపై ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ అధికారులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ అవినీతి, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 27న జయరాజుతోపాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 13(1)(బీ), 13(2) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
సోదాల్లో హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్‌ గుర్తించారు. కీసరలో రెండు ప్లాట్లతోపాటు తుంగతుర్తి, తూప్రాన్‌, సూర్యాపేటలో ఒక్కో ప్లాట్‌ చొప్పున మొత్తం ఐదు ప్లాట్లను గుర్తించగా, వాటి డాక్యుమెంట్‌ విలువను సుమారు రూ.15.77 లక్షలుగా అంచనా వేశారు. మరో 3.21 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.8 లక్షలుగా పేర్కొన్నారు.
అంతేకాకుండా రూ.10.03 లక్షల నగదు, రూ.19.86 లక్షల విలువైన ఎల్‌ఐసీ, మ్యాక్స్‌లైఫ్‌ పొదుపు పథకాలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు గుర్తించారు. వాహనాల విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాల్లో రూ.20.86 లక్షలు, మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు ఉన్నట్లు ఏసీబీ ప్రకటించింది.
సోదాల్లో 629 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించగా, వాటి విలువను సుమారు రూ.37.23 లక్షలుగా లెక్కించారు. ఇంట్లోని వస్తువుల విలువను మరో రూ.10.67 లక్షలుగా అంచనా వేశారు. ఇప్పటివరకు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ రూ.3,06,53,177గా ఉన్నట్లు ఏసీబీ పేర్కొంది. స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్‌ విలువ డాక్యుమెంట్‌ విలువ కంటే భారీగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

డ్రైవర్‌ ఖాతా నుంచి కుమార్తె ఖాతాకు నగదు!
దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగుచూసింది. అధికారి డ్రైవర్‌ సత్తునూరి యాదయ్య మొబైల్‌, బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా, అతడి ఖాతా నుంచి జయరాజు కుమార్తె ఖాతాకు పలుమార్లు సుమారు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న వ్యక్తుల నుంచి ఈ డబ్బును సేకరించి అధికారి కుమార్తె ఖాతాకు పంపినట్లు డ్రైవర్‌ విచారణలో చెప్పాడని ఏసీబీ పేర్కొంది. అయితే నగదు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు బదిలీ చేశారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Note:  ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలను కోరింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder