- బాలాజీ జ్యువెల్లర్స్ చోరీ కేసులో నలుగురి అరెస్ట్
- గోడకు రంధ్రం చేసి బంగారం, వెండి ఆభరణాల అపహరణ
- 59.220 గ్రాముల బంగారు బార్, రెండు కిలోల వెండి పట్టీలు స్వాధీనం
- నిందితులను కస్టడీలోకి తీసుకుని ఘటనాస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్
సామాన్యుడి అస్త్రం / చందానగర్:
చందానగర్‌లోని బాలాజీ జ్యువెల్లర్స్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నేరం జరిగిన ప్రాంతం నుంచి నిందితులు ప్రయాణించిన మార్గాల వరకు సుమారు 500 సీసీటీవీ కెమెరాల దృశ్యాలను జల్లెడపట్టిన క్రైమ్, సీసీఎస్ బృందాలు నలుగురు నిందితులను గుర్తించాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన నలుగురిని పీటీ వారెంట్ల ద్వారా కస్టడీలోకి తీసుకుని, చోరీ సొత్తులో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గౌతమినగర్‌లోని శ్రీ బాలాజీ జ్యువెల్లర్స్ యజమాని నూకల శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు 2026 ఆగస్టు 1న క్రైమ్ నంబర్ 829/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 331(4), 305 కింద దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 31 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 1 మధ్య గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం తాళాలు పగులగొట్టారు. షాపు వెనుక గోడకు అమర్చిన ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి, అక్కడున్న రంధ్రాన్ని పెద్దదిగా చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం స్టోరేజ్ గది తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు.
కేసును సవాలుగా తీసుకున్న చందానగర్ క్రైమ్, సీసీఎస్ బృందాలు సుమారు 500 సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించాయి. సాంకేతిక ఆధారాలతో నిందితులు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లాయి. అయితే, మరో ఇంటి దొంగతనం కేసులో గ్వాలియర్ పోలీసులు వీరిని చందానగర్ పోలీసు బృందం చేరుకోవడానికి గంట ముందే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఛోటూ అలియాస్ యోగేష్ మండేలియా (31), గోలు అలియాస్ రాజేష్ మండేలియా (35), అతుల్ శర్మ (30), శ్యామ్‌సుందర్ కుష్వాహ్ (30)లను నిందితులుగా గుర్తించారు. వీరిని పీటీ వారెంట్ల ద్వారా చందానగర్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
పోలీసు విచారణలో చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను భింద్ జిల్లా కథా గ్రామంలోని అతుల్ శర్మ నివాసంలో దాచినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సమాచారంతో సెప్టెంబరు 13న మధ్యవర్తుల సమక్షంలో ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో 59.220 గ్రాముల బరువున్న కరిగించిన బంగారు బార్‌తోపాటు సుమారు రెండు కిలోల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. మరో కిలో వెండిని ఆశిష్ అనే దుకాణదారుడికి విక్రయించినట్లు నిందితులు వెల్లడించారని, అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
నిందితులను గ్వాలియర్ నుంచి చందానగర్‌కు తీసుకొచ్చిన పోలీసులు ఘటనాస్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. చోరీకి ఎలా ప్రణాళిక రూపొందించారు? దుకాణంలోకి ఏ మార్గంలో ప్రవేశించారు? చోరీ సొత్తును ఎక్కడికి తరలించారు? అనే వివరాలను సేకరించారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఆర్‌సీ పురం డివిజన్ ఏసీపీ సీహెచ్.వై.శ్రీనివాస్‌కుమార్ పర్యవేక్షణలో చందానగర్ ఇన్‌స్పెక్టర్లు ఎ.శ్రీధర్‌కుమార్, కె.ప్రదీప్‌కుమార్, డిటెక్టివ్ క్రైమ్ సిబ్బంది, సీసీఎస్ బృందం కేసు ఛేదనలో కీలకంగా పనిచేసింది. సిబ్బందికి తగిన రివార్డులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.