Politics

ఎండకు చెక్.. స్వర్ణపురి పార్కు పచ్చదనానికి బోర్‌వెల్‌ భరోసా!

ఎండకు చెక్.. స్వర్ణపురి పార్కు పచ్చదనానికి బోర్‌వెల్‌ భరోసా!
  • ఏడాది పొడవునా మొక్కలకు నీరందించేందుకు నూతన బోర్‌వెల్‌
  • కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన ఉప్పలపాటి శ్రీకాంత్‌
  • పార్కుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు

సామాన్యుడి అస్త్రం / మియాపూర్: కాంక్రీట్‌ నిర్మాణాలతో వేగంగా విస్తరిస్తున్న నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించే పార్కులు కనుమరుగవకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీ పార్కులో మొక్కల సంరక్షణ, పచ్చదనం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన నూతన బోర్‌వెల్‌ సదుపాయాన్ని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్కులు కేవలం సాయంత్రం వేళల్లో సేదతీరే ప్రదేశాలు మాత్రమే కాదన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతోపాటు ప్రజల ఆరోగ్యం, చిన్నారుల భవిష్యత్తుకు పార్కులు ఎంతో అవసరమని చెప్పారు. పార్కుల్లో నాటిన మొక్కలు ఎండిపోకుండా నిరంతరం సంరక్షించాలంటే శాశ్వత నీటి వసతి అత్యంత కీలకమని పేర్కొన్నారు. నూతన బోర్‌వెల్‌ ద్వారా పార్కులోని మొక్కలకు ఏడాది పొడవునా అవసరమైన నీటిని అందించవచ్చని తెలిపారు. నీటి కొరత కారణంగా పచ్చదనం దెబ్బతినకుండా ఈ సదుపాయం ఉపయోగపడుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని మొక్కలు నాటి పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దవచ్చని వివరించారు. అభివృద్ధి పనులు ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తిస్థాయిలో విజయవంతమవుతాయని శ్రీకాంత్ స్పష్టం చేశారు. కాలనీవాసులు పార్కులను ప్రభుత్వ ఆస్తులుగా కాకుండా తమ సొంత ఆస్తిగా భావించి పరిశుభ్రత, మొక్కల సంరక్షణలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్‌లోని ప్రతి కాలనీలో పచ్చదనం, పార్కుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దేవేందర్‌రావు, మాధవరం గోపాల్‌రావు, కాలనీ అధ్యక్షుడు దివాకర్‌రెడ్డి, కార్యదర్శి దశరథరావు, చారి, సురేష్, రమేష్‌చంద్ర, బాలయ్య, నర్సింగ్‌రావు, యూబీడీ సూపర్‌వైజర్ కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder