Telangana

బాచుపల్లి సిగ్నల్ వద్ద బకెట్లతో వర్షపు నీరు తొలగింపు.. ఇదేనా శాశ్వత పరిష్కారం?

బాచుపల్లి సిగ్నల్ వద్ద బకెట్లతో వర్షపు నీరు తొలగింపు.. ఇదేనా శాశ్వత పరిష్కారం?
  • కీలక జంక్షన్‌లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్తంభించిన ట్రాఫిక్
  • బకెట్లతో నీటిని తోడిపోసిన హైడ్రా పారిశుద్ధ్య సిబ్బంది
  • డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారుల డిమాండ్
సామాన్యుడి అస్త్రం / బాచుపల్లి : వర్షం కురిసిన ప్రతిసారీ నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. తాజాగా బాచుపల్లి సిగ్నల్ వద్ద వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు హైడ్రా మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు బకెట్లతో నీటిని ఎత్తిపోస్తున్న దృశ్యాలు అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టాయి.
బాచుపల్లి సిగ్నల్‌ పరిసర ప్రాంతం రెండు యూటర్న్‌లకు జంక్షన్‌ పాయింట్‌గా ఉండటంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అలాంటి కీలక ప్రదేశంలోనే వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలాల్సి వచ్చింది. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు ఒకేసారి నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షంలోనూ పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించడం అభినందనీయం. అయితే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన సిగ్నల్‌ వద్ద నిలిచిన నీటిని బకెట్లతో తొలగించాల్సిన పరిస్థితి రావడం సంబంధిత వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వర్షపు నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం లేదా వాటి సామర్థ్యం సరిపోకపోవడం వంటి కారణాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ప్రతి వర్షానికి కార్మికులను రంగంలోకి దించి బకెట్లతో నీటిని తొలగించడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. బాచుపల్లి సిగ్నల్‌ వద్ద వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. రద్దీ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోకపోతే చిన్నపాటి వర్షానికే ట్రాఫిక్‌ సమస్యలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder