Telangana

చదువుకోవాల్సిన చేతులతో చపాతీలు!.. విద్యార్థులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్‌ యాజమాన్యం?

చదువుకోవాల్సిన చేతులతో చపాతీలు!.. విద్యార్థులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్‌ యాజమాన్యం?
  • దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులతో చపాతీలు చేయిస్తున్నారనే ఆరోపణలు
  • వంట సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నా పిల్లలతో పనులు చేయించడంపై తీవ్ర ఆగ్రహం
  • ప్రిన్సిపాల్‌, వార్డెన్ల తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్
సామాన్యుడి అస్త్రం / దామరచర్ల : చదువుకుని జీవితంలో ఎదగాల్సిన విద్యార్థుల చేతులకు పుస్తకాలకు బదులు చపాతీ కర్రలు అప్పగించిన ఘటన నల్గొండ జిల్లా దామరచర్లలో తీవ్ర దుమారం రేపుతోంది. దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల చేతే చపాతీలు చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్‌ ప్రిన్సిపాల్‌, వార్డెన్ల పర్యవేక్షణలోనే పిల్లలతో వంట పనులు చేయిస్తున్నారని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు మంచి వసతి, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాలను నిర్వహిస్తోంది. వంట పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి జీతాలు కూడా చెల్లిస్తోంది. అయినప్పటికీ దామరచర్ల హాస్టల్‌లో విద్యార్థుల చేత చపాతీలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హాస్టల్‌లో వంట సిబ్బంది విధులకు హాజరవుతున్నారా? హాజరైతే విద్యార్థులతో వంట పనులు ఎందుకు చేయిస్తున్నారు? సిబ్బంది కొరత ఉంటే ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అనే ప్రశ్నలకు ప్రిన్సిపాల్‌, వార్డెన్లు సమాధానం చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పిల్లలకు స్వయం సేవ పేరుతో అప్పుడప్పుడు చిన్నపాటి బాధ్యతలు అప్పగించడం వేరు. కానీ వేడి పొయ్యిలు, పెనాలు, వంట సామగ్రి మధ్య వారితో చపాతీలు తయారు చేయించడం వారి భద్రతను ప్రమాదంలోకి నెట్టడమేనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీస్తున్నారు.
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వెంటనే హాస్టల్‌ను తనిఖీ చేసి, విద్యార్థుల వాంగ్మూలాలు నమోదు చేయాలని కోరుతున్నారు. వంట సిబ్బంది హాజరు రిజిస్టర్లు, విధుల వివరాలు, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన ప్రిన్సిపాల్‌, వార్డెన్లు, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న ప్రజాధనం సక్రమంగా వినియోగమవుతోందా? లేక అధికారుల నిర్లక్ష్యానికి పిల్లలే మూల్యం చెల్లిస్తున్నారా? అనే ప్రశ్నలకు జిల్లా అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆరోపణలపై హాస్టల్‌ యాజమాన్యం, సంబంధిత అధికారుల వివరణ రావాల్సి ఉంది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder