Crime

ఓయో రూమ్‌లో ‘గంజాయి బజార్’.. రూ.9 లక్షల సరకు పట్టివేత!

ఓయో రూమ్‌లో ‘గంజాయి బజార్’.. రూ.9 లక్షల సరకు పట్టివేత!
  • కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని హోటల్‌పై ఎక్సైజ్ STF దాడి
  •  చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్న 17.1 కిలోల గంజాయి స్వాధీనం
  • అస్సాంకు చెందిన ఇద్దరి అరెస్ట్‌.. సెక్యూరిటీ గార్డుల నుంచి డ్రగ్స్‌ దందాలోకి!
సామాన్యుడి అస్త్రం / కొండాపూర్:
ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి సెక్యూరిటీ గార్డులుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు.. వచ్చే జీతం సరిపోవడం లేదంటూ అడ్డదారిలోకి వెళ్లారు. అస్సాం నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ చివరకు ఎక్సైజ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు చిక్కారు.
కొండాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ‘ఓయో హైలెట్స్‌’ హోటల్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్‌ STF అధికారులు దాడి నిర్వహించారు. హోటల్‌ గదులను కేంద్రంగా చేసుకుని గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా సిద్ధం చేసి వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ దాడిలో సుమారు రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ధీరజ్‌ దాస్‌ (39), రబాలి అలీ (25)లను అరెస్టు చేశారు. నిందితులు గతంలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు ఎక్సైజ్‌ అధికారుల విచారణలో వెల్లడైంది.
సెక్యూరిటీ గార్డులుగా వచ్చే జీతం తమ అవసరాలకు సరిపోవడం లేదనే కారణంతో త్వరగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు అధికారులు తెలిపారు. అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి, హోటల్‌ గదుల్లో నిల్వచేసి చిన్న పొట్లాలుగా విక్రయిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ ముఠా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న వారెవరు? నిందితులకు అస్సాంలో సరకు అందిస్తున్న ప్రధాన వ్యక్తులు ఎవరు? హైదరాబాద్‌లో వీరికి సహకరించిన స్థానిక నెట్‌వర్క్‌ ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హోటల్‌ గదిని గంజాయి విక్రయ కేంద్రంగా మార్చడం స్థానికంగా కలకలం రేపింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder