- లేక్ ఐడీ 2821 బిన్ చెరువు బఫర్‌జోన్‌లో నిర్మాణమని ఆరోపణ
- పనులు నిలిపివేసి, అనుమతి రద్దు చేయాలంటూ అధికారిక లేఖలు
- నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదని విమర్శలు
నిజాంపేట్ సర్కిల్–58 పరిధిలోని బాచుపల్లి గ్రామంలో ఉన్న పెద్దకుంట.. బైరోని చెరువు.. బిన్ చెరువుగా పిలిచే జలాశయం చుట్టూ జరుగుతున్న నిర్మాణం అధికార వ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకంగా మార్చింది. లేక్ ఐడీ నంబర్ 2821గా నమోదైన ఈ చెరువుకు ఎఫ్‌టీఎల్ సరిహద్దు నుంచి 30 మీటర్ల బఫర్‌జోన్ ఉన్నట్లు హెచ్‌ఎండీఏ అధికారిక మ్యాప్ స్పష్టం చేస్తోంది.
ఈ బఫర్‌జోన్ పరిధిలో నిర్మాణం జరుగుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించినట్లు సంబంధిత లేఖల వివరాలు వెల్లడిస్తున్నాయి. 2026 జనవరి 12న జారీచేసిన లేఖ నంబర్ DEE/ISD No.3/Medchal/2026/951తోపాటు, జనవరి 31న జారీచేసిన EE/Irrg Divn No.1/HYD/DB/DEE-T/JTO-1/2026-27/4196 లేఖల్లో నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం.

కాగితాల్లో ఆదేశాలు.. క్షేత్రంలో నిర్మాణాలు!
నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయడంతోపాటు మున్సిపల్ అనుమతిని రద్దుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రాకు నీటిపారుదల అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ నెలలు గడుస్తున్నా నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారికంగా ఉల్లంఘనను గుర్తించిన తర్వాత కూడా స్టాప్‌వర్క్ నోటీసులు అమలు కాకపోవడం, అనుమతి రద్దుపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
చెరువుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థలు ఉన్నప్పటికీ ఒక శాఖ మరో శాఖకు లేఖ రాయడంతోనే బాధ్యత ముగిసినట్లు వ్యవహరిస్తే ఆక్రమణలను అడ్డుకోవడం ఎలా సాధ్యమని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. చర్యల జాప్యం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర ప్రయోజనాలు ఉన్నాయా అన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, నిర్మాణదారుల వాదన వెల్లడికావాల్సి ఉంది.
బిన్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ను మరోసారి సంయుక్తంగా పరిశీలించి, అనుమతుల వివరాలను బహిర్గతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉల్లంఘన నిర్ధారణైతే నిర్మాణాన్ని నిలిపివేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
