- డెంగ్యూ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు ఆదేశం
- హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృత తనిఖీలు
- వీధికుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు, ఏబీసీ కార్యక్రమం వేగవంతం
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్: వర్షాకాలంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రజారోగ్య సంక్షోభంగా మారే ప్రమాదముందని, పారిశుధ్య నిర్వహణలో రాజీ పడొద్దని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మల శ్రీజన అధికారులను ఆదేశించారు. ఫైళ్లలో నివేదికలు చూపించడం కాకుండా ప్రతి సర్కిల్‌లో క్షేత్రస్థాయి ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజారోగ్యం, పారిశుధ్య సమీక్షలో అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆరోగ్య, పారిశుధ్య విభాగాల అధికారులు పాల్గొన్నారు. సర్కిళ్లవారీగా అమలవుతున్న కార్యక్రమాలు, సమస్యలు, తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమీక్షించారు.
దోమలపై యుద్ధం - చెత్త నిర్వహణలో రాజీ వద్దు
డెంగ్యూ, మలేరియా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫాగింగ్, లార్వా నిర్మూలన కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించాలని శ్రీజన సూచించారు. చెరువులు, నీరు నిలిచే ప్రాంతాల్లో గాంబూసియా చేపలను వదలడంతోపాటు ఆయిల్ బాల్స్ వినియోగాన్ని పెంచాలని చెప్పారు. గతంలో ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ముందస్తు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. బల్క్ వేస్ట్ జనరేటర్ల నమోదును వేగవంతం చేసి, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకాంక్ష టాయిలెట్ల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల వినియోగం, పారిశుధ్య మౌలిక వసతుల పురోగతిని తరచూ సమీక్షించాలని పేర్కొన్నారు.
హోటళ్లకు తనిఖీల సెగ
ప్రజలకు సురక్షిత ఆహారం అందేలా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార విక్రయ కేంద్రాల్లో తనిఖీలను విస్తరించాలని కమిషనర్ స్పష్టం చేశారు. గత తనిఖీల్లో లోపాలు బయటపడిన సంస్థలను మళ్లీ పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వీధికుక్కలపై కార్యాచరణ
వీధికుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయడంతోపాటు జంతు జనన నియంత్రణ కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. మృత జంతువుల నిర్వహణ కోసం దహన కేంద్రాలకు అనువైన స్థలాలను త్వరగా గుర్తించాలని ఆదేశించారు. ప్రతి సర్కిల్‌లో అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని శ్రీజన స్పష్టం చేశారు.