GHMC

142లో 52 ఫైర్‌ ఎన్‌వోసీలు ఫేక్‌! జూనియర్‌ కాలేజీల ఫోర్జరీపై హైడ్రా కొరడా

142లో 52 ఫైర్‌ ఎన్‌వోసీలు ఫేక్‌! జూనియర్‌ కాలేజీల ఫోర్జరీపై హైడ్రా కొరడా
  • 142 ఫైర్‌ ఎన్‌వోసీల పరిశీలన.. 52 ధ్రువపత్రాలు నకిలీవని నిర్ధారణ
  • రెండు దశల్లో హైదరాబాద్‌ సహా నాలుగు జిల్లాల పత్రాల తనిఖీ
  • జూలై 4న లేక్‌ పోలీసులకు ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డుకు సూచన

జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు సమర్పించిన ఫైర్‌ ఎన్‌వోసీల్లో భారీ ఫోర్జరీ వ్యవహారం వెలుగుచూసింది. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని కళాశాలలు సమర్పించిన 142 ఫైర్‌ ఎన్‌వోసీలను హైడ్రా పరిశీలించగా, 90 మాత్రమే అసలైనవని.. మిగిలిన 52 ధ్రువపత్రాలు నకిలీ లేదా ఫోర్జరీ చేసినవని గుర్తించింది.

2025–26, 2026–27 విద్యా సంవత్సరాలకు సంబంధించి జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌ బోర్డుకు సమర్పించిన ఫైర్‌ ఎన్‌వోసీలను హైడ్రా రెండు దశల్లో పరిశీలించింది. మొదటి దశలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు మొత్తం 76 ఎన్‌వోసీలను ప్రామాణికత నిర్ధారణకు పంపించారు. హైడ్రా కార్యాలయ రికార్డులతో పోల్చగా వాటిలో ఏడు పత్రాలు నకిలీవని తేలింది.

రెండో దశలో మరో 66 ఎన్‌వోసీలు పరిశీలనకు రాగా, ఏకంగా 45 ధ్రువపత్రాలు ఫోర్జరీ చేసినవిగా హైడ్రా గుర్తించింది. రెండు దశల్లో కలిపి 52 నకిలీ పత్రాలు బయటపడటంతో సంబంధిత కళాశాలలపై పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యామండలికి సూచించింది.

విద్యార్థుల ప్రాణాలతో ఆటలా?

ఫైర్‌ ఎన్‌వోసీ కేవలం అనుమతుల కోసం సమర్పించే కాగితం కాదని, భవనంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలను రక్షించే భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ధ్రువీకరణ అని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కీలకమైన పత్రాలను ఫోర్జరీ చేయడం వేలాది మంది విద్యార్థుల భద్రతను ప్రమాదంలోకి నెట్టడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

నకిలీ పత్రాలు తయారుచేసిన, సమర్పించిన బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైడ్రా జూలై 4న నెక్లెస్‌ రోడ్డులోని లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సంబంధిత కళాశాలల అనుమతులు, అనుబంధ గుర్తింపులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల నిర్వాహకులతో హైడ్రా సమావేశం నిర్వహించి చెల్లుబాటు అయ్యే ఫైర్‌ ఎన్‌వోసీలపై మార్గదర్శకాలు జారీచేసింది. నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థల వివరాలను పారదర్శకంగా వెల్లడించడంతోపాటు భవనాల్లో వాస్తవంగా అగ్నిమాపక ఏర్పాట్లు ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder