- నిర్మాణ స్థల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలకు పోలీసుల అడ్డుకట్ట
- ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో భారీ ధర్నా
- ప్రభుత్వ తీరును నిరసిస్తూ మార్మోగిన నినాదాలు
సామాన్యుడి అస్త్రం / రాయదుర్గం : మల్కం చెరువు ఎదురుగా నిర్మిస్తున్న పీఎం ఏక్తా యూనిటీ మాల్ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాల్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో పార్టీ శ్రేణులు అక్కడికక్కడే ఆందోళనకు దిగాయి. పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించాయి.
పోలీసుల అడ్డుకట్టతో భగ్గుమన్న నిరసన
ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజుతోపాటు ఉద్యమకారుడు చిర్రా రవీందర్ యాదవ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నిర్మాణ స్థలంలోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవడంపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ నిధులతో ముడిపడిన ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు “సీఎం డౌన్ డౌన్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొందరు నాయకులు పోలీసుల వలయాన్ని దాటుకుని నిర్మాణ ప్రాంతం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. దీంతో మాల్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

‘ప్రశ్నిస్తే అడ్డుకుంటారా?’
ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతును పోలీసులతో అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ వ్యయం, ప్రభుత్వ భూమి వినియోగంపై పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రజాధనానికి సంబంధించిన ప్రతి అంశంపై పారదర్శకత ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రాయదుర్గంలో ప్రతిపాదించిన పీఎం ఏక్తా మాల్ టెండర్లలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపించగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్టు ‘వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్’, జీఐ ఉత్పత్తులు, దేశీయ హస్తకళల ప్రోత్సాహం కోసం రూపొందించినట్లు వెల్లడైంది. ప్రస్తుత ఆందోళనపై పోలీసులు లేదా ప్రాజెక్టు అధికారుల నుంచి పూర్తి వివరణ రావాల్సి ఉంది.