- జ్ఞానం, ఏకాగ్రత, నైతికతతోనే ఉన్నత శిఖరాలు
- మత్తు పదార్థాలు, సోషల్ మీడియా వ్యసనానికి దూరంగా ఉండాలి
- దేశాభివృద్ధిలో భాగస్వాములమవుతామని విద్యార్థుల ప్రతిజ్ఞ
సామాన్యుడి అస్త్రం / బీహెచ్ఈఎల్ : యువత జ్ఞానం, ఏకాగ్రత, నైతిక విలువలను అలవరచుకున్నప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కేంద్రీయ విశ్వవిద్యాలయం హెల్త్ ఫిజియాలజీ విభాగం ఆచార్య చివుకుల ఉష పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీహెచ్ఈఎల్‌లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.రవీందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆచార్య చివుకుల ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
దురలవాట్లతో భవిష్యత్తు అంధకారం
యువత ఆలోచనల్లో వేగం, చేతల్లో చురుకుదనం ఉంటుందని, వారు సంకల్పిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలరని ఉష అన్నారు. అయితే కొందరు యువత మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలకు బానిసై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు, అంతర్జాలాన్ని అవసరానికి మించి ఉపయోగించడం ఏకాగ్రతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు.

సాంకేతికతే ఉపాధికి కొత్త దారి
మారుతున్న శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. విలువలతో కూడిన గుణాత్మక విద్యతోపాటు యోగా, ధ్యానం, పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. యువతకు సరైన దిశానిర్దేశం అందించడంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, పౌర సమాజం, ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఐక్యరాజ్యసమితి 2000 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 2026 సంవత్సరానికి “Different Contexts, Common Aspirations” నినాదాన్ని ప్రకటించింది. భిన్న పరిస్థితుల్లో జీవిస్తున్న యువతకు గౌరవం, విద్య, ఉపాధి, భాగస్వామ్యం వంటి ఆకాంక్షలు ఉమ్మడిగా ఉంటాయన్నదే దీని ప్రధాన సందేశం. కార్యక్రమంలో విద్యార్థులతో దురలవాట్లకు దూరంగా ఉంటామని, జాతీయ సమైక్యతను కాపాడుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. అధ్యాపకుడు మధుసూదనరావు, అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, జనార్దన్, విద్యార్థులు పాల్గొన్నారు.