- బీఆర్ఎస్ టికెట్ ఆశావహుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న శ్రీధర్ పేరు
- మక్తా మహబూబ్‌పెట్ లో యువత, స్థానికులతో బలమైన అనుబంధం
- కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా కలిసొస్తుందంటున్న అనుచరులు
సామాన్యుడి అస్త్రం / మక్తామహబూబ్‌పెట్ :
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా అధికారిక నగారా మోగకముందే డివిజన్–241లో రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న నాయకులు క్షేత్రస్థాయిలో తమ బలాన్ని చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న వారిలో కాసాని శ్రీధర్ ముదిరాజ్ పేరు ముందువరుసలో వినిపిస్తోంది.
మక్తా–మహబూబ్‌పట్నం పరిధిలో శ్రీధర్‌కు స్థానిక ప్రజలతో ఉన్న పరిచయాలు, యువతతో కొనసాగిస్తున్న సన్నిహిత సంబంధాలు ఆయనకు రాజకీయంగా బలంగా మారుతున్నాయని అనుచరులు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై స్పందించడం, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, అవసరమైన సమయంలో స్థానికులకు అందుబాటులో ఉండటం వల్ల ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడిందని పేర్కొంటున్నారు.
శ్రీధర్ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం కూడా టికెట్ రేసులో ఆయనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆయన తండ్రి కాసాని రామాంజనేయులు గతంలో ఉపసర్పంచ్‌గా పనిచేసి స్థానిక ప్రజలకు సేవలందించారు. అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధి రాజకీయాల్లో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు ఉన్న గుర్తింపు, కుటుంబానికి ప్రజలతో కొనసాగుతున్న అనుబంధం శ్రీధర్ అభ్యర్థిత్వానికి అదనపు బలాన్నిస్తోందని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
డివిజన్–241లో బీఆర్ఎస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు స్థానికంగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించగల అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లగల నాయకత్వం అవసరమని స్థానికులు అంటున్నారు.
టికెట్ లభిస్తే ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని శ్రీధర్ అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కారం కోసం పోరాడటమే తమ లక్ష్యమని చెబుతున్నారు.
అయితే డివిజన్–241 బీఆర్ఎస్ టికెట్ కోసం మరికొందరు ఆశావహులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థి ఎంపిక పార్టీ అధిష్ఠానానికి కీలక పరీక్షగా మారనుంది. ప్రస్తుతానికి కాసాని శ్రీధర్ ముదిరాజ్ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ, చివరకు గులాబీ బాస్ ఆశీస్సులు ఎవరికి దక్కుతాయన్నది స్థానిక రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.