GHMC

‘వర్ణం’లో ఫంగస్‌ కూరగాయలు.. నోటీసుకు సిద్ధమైన సీ‌ఎంసీ!

‘వర్ణం’లో ఫంగస్‌ కూరగాయలు.. నోటీసుకు సిద్ధమైన సీ‌ఎంసీ!
  • డ్రైన్లలో నిలిచిన నీరు.. పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు
  • కాలీఫ్లవర్‌పై ఫంగస్‌.. చెడిన క్యాబేజీ, బంగాళాదుంపలు
  • ఫోస్‌కోస్‌ తనిఖీలో 61 శాతం స్కోరు.. నోటీసు జారీకి నిర్ణయం

సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్ : ఆహార పరిశుభ్రత, వినియోగదారుల భద్రతపై సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హఫీజ్‌పేట్‌ జెన్‌పాక్ట్‌ లేన్‌లోని ‘వర్ణం’ ఆహార కేంద్రంలో సీ‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వంటగది నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు. తనిఖీలో ఆహారం తయారుచేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, వంటగది నిర్వహణలో అనేక లోపాలు బయటపడటం ఆందోళన కలిగించింది. డ్రైన్లలో నీరు నిలిచిపోవడంతోపాటు ఆహార వ్యర్థాలు పేరుకుపోయినట్లు గుర్తించారు. ఆహార పదార్థాలను నేలపై ఉంచకుండా ఉపయోగించాల్సిన ప్యాలెట్లు అందుబాటులో లేవని, ఐరన్‌ కత్తులను వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


ఫ్రిజ్‌లో గందరగోళం

రిఫ్రిజిరేటర్‌ను సక్రమంగా శుభ్రం చేయకపోవడం, ఆహార పదార్థాలను క్రమబద్ధంగా అమర్చకపోవడంతోపాటు నీటి లీకేజీ ఉన్నట్లు తనిఖీలో తేలింది. పాక్షికంగా తయారుచేసిన, పూర్తిగా సిద్ధమైన ఆహార పదార్థాలపై తయారీ తేదీ, వినియోగ గడువు వంటి లేబుళ్లు లేవని అధికారులు గుర్తించారు. సీలింగ్‌పై దుమ్ము, ఎగ్జాస్ట్‌ వ్యవస్థపై జిడ్డు పేరుకుపోయినట్లు నమోదు చేశారు. కాలీఫ్లవర్‌పై ఫంగస్‌ కనిపించగా, చెడిపోయిన క్యాబేజీ, బంగాళాదుంపలను మంచి కూరగాయల నుంచి వేరు చేయకుండా ఉంచినట్లు అధికారులు గుర్తించారు. సిబ్బంది వైద్య పరీక్షలు, ఆహార పరీక్షలు, నీటి నాణ్యత పరీక్షలు, ప్యాకేజింగ్‌కు సంబంధించిన తప్పనిసరి రికార్డులు కూడా అందుబాటులో లేవని తెలిపారు.

ఈ తనిఖీలో ‘వర్ణం’కు ఫోస్‌కోస్‌ స్కోరు 61/100 నమోదైంది. గుర్తించిన లోపాలపై నోటీసు జారీ చేసి, నిర్ణీత గడువులోగా వాటిని సరిదిద్దాలని ఆదేశించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder