- పదేపదే నిబంధనలు ఉల్లంఘించే రెస్టారెంట్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయం
- ఆన్‌బోర్డింగ్‌కు ముందే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ సమగ్ర పరిశీలన
- ఒకే లైసెన్స్‌తో పలు సంస్థల నిర్వహణకు అడ్డుకట్ట
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసే వినియోగదారుల ఆరోగ్యానికి భరోసా కల్పించే దిశగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కీలక ముందడుగు వేసింది. క్షేత్రస్థాయిలో ఆహార విక్రయ కేంద్రాల తనిఖీలకే పరిమితం కాకుండా, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదికల స్థాయిలోనూ నిబంధనల అమలును కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా సీఎంసీ కమిషనర్ జొమాటో న్యాయ విభాగం ప్రతినిధులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పదేపదే ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లపై తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
ఉల్లంఘిస్తే డీలిస్టింగే!
ఆహార భద్రతా తనిఖీల్లో పదేపదే విఫలమవుతున్న ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను జొమాటో ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించడం లేదా వారి నమోదును రద్దు చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అధికారుల తనిఖీల్లో లోపాలు బయటపడిన సంస్థలు పేర్లు మార్చుకుని తిరిగి ఆన్‌లైన్‌లోకి రాకుండా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాలని సీఎంసీ సూచించింది.
లైసెన్స్ ఉంటేనే ఆన్‌బోర్డింగ్
కొత్త రెస్టారెంట్‌ను ప్లాట్‌ఫామ్‌లో చేర్చే ముందు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నంబర్, చెల్లుబాటు గడువు, వ్యాపార కేటగిరీని తప్పనిసరిగా ధ్రువీకరించాలని స్పష్టం చేసింది. ఒకే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను చూపిస్తూ వేర్వేరు ప్రాంతాల్లో పలు సంస్థలను నిర్వహిస్తున్న అక్రమ పద్ధతులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు.
తిరిగి చేరాలంటే కఠిన తనిఖీ
నిబంధనలు ఉల్లంఘించి డీలిస్ట్ అయిన సంస్థలను తిరిగి ప్లాట్‌ఫామ్‌లో అనుమతించే ముందు పరిశుభ్రత, లైసెన్స్, ఆహార నాణ్యతకు సంబంధించిన సమగ్ర తనిఖీలు జరపాలని అధికారులు సూచించారు. వినియోగదారులకు సురక్షితమైన ఆహారం అందించేందుకు సీఎంసీ చేపడుతున్న చర్యలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని జొమాటో న్యాయ బృందం హామీ ఇచ్చింది.