GHMC

నోటీసుల్లేవ్.. నేరుగా బుల్డోజర్లా? హైడ్రాను నిలదీసిన హైకోర్టు

నోటీసుల్లేవ్.. నేరుగా బుల్డోజర్లా? హైడ్రాను నిలదీసిన హైకోర్టు
  • కొండాపూర్‌లో హద్దుగోడ, వాచ్‌మన్ గది కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం
  • ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన ఆధారాలేమిటని అధికారులకు ప్రశ్న
  • పూర్తి రికార్డులతో మాజీ తహసీల్దార్ హాజరుకావాలని ఆదేశం
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్: నోటీసులు ఇవ్వకుండా పౌరుల ఆస్తులపైకి బుల్డోజర్లను పంపడమేమిటంటూ తెలంగాణ హైకోర్టు హైడ్రా, రెవెన్యూ అధికారులను తీవ్రంగా నిలదీసింది. బాధితులకు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా కల్పించకుండా ఆకస్మిక కూల్చివేతలకు పాల్పడటం చట్టబద్ధ పాలనకు విరుద్ధమని స్పష్టం చేసింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నంబర్ 60లోని 350 చదరపు గజాల స్థలానికి సంబంధించిన హద్దుగోడ, వాచ్‌మన్ గదిని హైడ్రా అధికారులు కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ పెమ్మసాని సుధారాణి హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టగా, కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైడ్రా సమర్పించిన కౌంటర్‌లోనూ నోటీసుల ప్రస్తావన లేదని వివరించారు.
ఈ వాదనలపై స్పందించిన న్యాయస్థానం.. నోటీసులు జారీచేస్తే బాధితులు కోర్టును ఆశ్రయిస్తారనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపడుతున్నారా అని ప్రశ్నించింది. భూమిపై వివాదం ఉన్నా, ప్రభుత్వ భూమిగా భావించినా చట్టపరమైన విధానాన్ని అనుసరించడం తప్పనిసరని తేల్చిచెప్పింది.
సదరు స్థలం ప్రభుత్వ భూమేనని ఎవరు, ఏ ఆధారాలతో నిర్ధారించారన్న ప్రశ్నకు ప్రస్తుత తహసీల్దార్ సమాధానమిస్తూ, తనకు ముందు పనిచేసిన అధికారి ఆ విధంగా గుర్తించినట్లు తెలిపారు. దీంతో ఆ నిర్ణయానికి సంబంధించిన పూర్తి రికార్డులతో అప్పటి తహసీల్దార్ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగా పౌరుల హక్కులు దెబ్బతినకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కూల్చివేతకు ముందు నోటీసు, వివరణ ఇచ్చుకునే అవకాశం, భూమి రికార్డుల పరిశీలన తప్పనిసరని గుర్తుచేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder