Politics

తెలంగాణకు దిక్సూచి జయశంకర్.. ఆయన ఆశయాలే మనకు మార్గం: సైబరాబాద్ సీపీ

తెలంగాణకు దిక్సూచి జయశంకర్.. ఆయన ఆశయాలే మనకు మార్గం: సైబరాబాద్ సీపీ
  • సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
  • చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీపీ డా.ఎం.రమేష్‌
  • సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు

సామాన్యుడి అస్త్రం / గచ్చిబౌలి: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో బలంగా నాటిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సేవలు చిరస్మరణీయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్‌ ఐపీఎస్‌ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన జయశంకర్ చిత్రపటానికి సీపీ రమేష్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పూలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ తన జీవితాంతం చేసిన కృషి, ప్రజల పట్ల చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని సీపీ కొనియాడారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను శాస్త్రీయంగా విశ్లేషించి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించిన గొప్ప మేధావి జయశంకర్ అని పేర్కొన్నారు. ఆయన కేవలం ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని చెప్పడమే కాకుండా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, వనరులు, హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో నిత్యం తీరికలేకుండా ఉండే పోలీసు అధికారులు కాసేపు జయశంకర్ చిత్రపటం ముందు నిలబడి ఆయన సేవలను స్మరించుకోవడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. తెలంగాణ సాధన వెనుక ఉన్న త్యాగాలు, ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యంరెడ్డి, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌తోపాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder