Asthram: పటాన్‌చెరు పరిధిలోని జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ సమస్యలు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు, కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలతో పాటు ముత్తంగి పిస్తా హౌస్ సమీపంలో నీరు నిలిచే ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు కొనసాగుతున్న ఎన్‌హెచ్–65 విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చిన్నపాటి వర్షానికే ముత్తంగి వద్ద రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు విస్తరణ పనులు, మరోవైపు వాటర్‌లాగింగ్ కారణంగా ప్రయాణం ఆలస్యమవుతోంది. హైదరాబాద్ నగరాన్ని సంగారెడ్డి వైపు అనుసంధానించే ఈ రహదారి ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, నిత్య ప్రయాణికులకు ప్రధాన మార్గం. ఇక్కడ ఏర్పడే చిన్న అంతరాయం కూడా వేలాది మంది రోజువారీ ప్రయాణంపై ప్రభావం చూపుతుంది.
వర్షపు నీరు నిలవకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని జేసీపీ సంబంధిత అధికారులు, పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలను ఆదేశించారు. రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్మాణ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
అనంతరం పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆయన సిబ్బంది సంఖ్య, ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాద కేసులు, రికార్డుల నిర్వహణను సమీక్షించారు. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలను పెంచాలని, నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీవ్రతరం చేయాలని ఆదేశించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ట్రాఫిక్–2 డీసీపీ శ్రీమతి శేషాద్రిణి రెడ్డి ఐపీఎస్, మియాపూర్ ట్రాఫిక్ ఏసీపీ ఆది మూర్తి, పటాన్‌చెరు ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ శ్యామ్‌సుందర్‌రెడ్డి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ నరేశ్ పాల్గొన్నారు.