Telangana

గండిపేట టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

గండిపేట టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

Asthram: రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల జర్నలిస్టు అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక సోమవారం ఏకగ్రీవంగా జరిగింది. మంచిరేవుల కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ‘వార్త’ రిపోర్టర్ జి. రాము యాదవ్‌ను మండల అధ్యక్షుడిగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, ఉపాధ్యక్షుడు భీమన్న, సంయుక్త కార్యదర్శి సూర్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు రాజు తదితరులు హాజరయ్యారు.

శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే నిరంతరం పోరాడుతుందన్నారు. జిల్లాలో ప్రతి మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలయ్యేలా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా అధ్యక్షుడు సలీమ్ పాషా మాట్లాడుతూ పత్రికలు ప్రజల కళ్లు, జర్నలిస్టులు సమాజానికి గొంతుకలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యే హెల్త్ కార్డులు అందించాలని కోరామన్నారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు వారిని తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

నూతన అధ్యక్షుడు రాము యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ సభ్యుల సంక్షేమం కోసం సమష్టిగా పనిచేస్తానన్నారు.

ఉపాధ్యక్షులుగా గోపాల్, టి.సత్యంగౌడ్, బి.ప్రవీణ్‌యాదవ్; ప్రధాన కార్యదర్శిగా ఎస్.నరేందర్; సంయుక్త కార్యదర్శులుగా ఎ.శివకుమార్, ఎస్.ప్రభాకర్, జి.నరేష్‌కుమార్; ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా జి.విజయ్‌కుమార్, ఎన్.రామకృష్ణ ఎన్నికయ్యారు. విజయ్‌ప్రతాప్, దాసరి రవికుమార్, లక్ష్మీనారాయణ, శ్యామ్‌కుమార్, సుగ్రీవ్ కార్యవర్గ సభ్యులుగా, రాజేందర్‌రెడ్డి, రాజు, జెట్టి విష్ణుకుమార్, సత్యకుమార్ గౌరవ సలహాదారులుగా ఎంపికయ్యారు.

ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులకూ ఆరోగ్య భద్రత, సొంతింటి భరోసా అవసరమనే ఆకాంక్ష ఈ సమావేశంలో బలంగా వినిపించింది.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder