- ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 311 మంది పట్టివేత
- కేసుల్లో 238 మంది ద్విచక్ర వాహనదారులే
- 18 మందిలో 301 నుంచి 550 ఎంజీ వరకు నమోదైన బీఏసీ
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : వారాంతపు వేడుకల పేరుతో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 311 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ఏడీసీపీ (అడ్మిన్) జి.నరేందర్ తెలిపారు.
కేసుల్లో బైక్‌లదే అగ్రస్థానం!
పోలీసులు నమోదు చేసిన 311 కేసుల్లో ద్విచక్ర వాహనదారులే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 238 మంది బైక్ రైడర్లు, 16 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది కారు డ్రైవర్లు, ఒక భారీ వాహన డ్రైవర్ మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ద్విచక్ర వాహనదారులు పెద్ద సంఖ్యలో పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో బైక్ నడిపితే చిన్న పొరపాటు జరిగినా ప్రాణాంతక ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
18 మందిలో ప్రమాదకర మోతాదు!
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్–బీఏసీ ఆధారంగా కేసులను పోలీసులు మూడు విభాగాలుగా వర్గీకరించారు. పట్టుబడిన వారిలో 255 మందికి 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్ స్థాయి నమోదైంది. మరో 38 మందికి 201 నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య నమోదు కాగా, 18 మంది వాహనదారుల్లో ఏకంగా 301 నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య బీఏసీ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇంతటి మద్యం మత్తులో వాహనాలు నడపడం వారితోపాటు రోడ్డుపై ప్రయాణించే అమాయకుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెట్టడమేనని పోలీసులు పేర్కొన్నారు.
కోర్టు ముందు 311 మంది
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుబడిన వాహనదారులందరిపై చట్టపరమైన కేసులు నమోదు చేశారు. వీరిని సంబంధిత న్యాయస్థానాల ముందు హాజరుపరచనున్నట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వారాంతాలకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రాణం తీస్తే పదేళ్ల జైలు!
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే, ఘటన స్వభావాన్ని బట్టి భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
283 కేసులకు కోర్టు తీర్పులు
ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు మొత్తం 283 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఒకరికి జరిమానాతోపాటు జైలు శిక్ష, 11 మందికి జరిమానాతోపాటు సామాజిక సేవ, మిగిలిన 271 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించిన తర్వాత సొంతంగా వాహనం నడపకుండా క్యాబ్, ఆటో లేదా ప్రజా రవాణాను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. క్షణిక నిర్లక్ష్యం ఒక కుటుంబానికి జీవితాంతం శోకాన్ని మిగల్చవచ్చని హెచ్చరించారు.