Telangana

హఫీజ్‌పేట్‌ హెల్త్ సెంటర్‌కు డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

హఫీజ్‌పేట్‌ హెల్త్ సెంటర్‌కు డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ
  • వైద్య సిబ్బంది హాజరు, ఓపీ సేవలపై ఆరా
  • మందుల నిల్వలు, రికార్డులు, పరిశుభ్రత పరిశీలన
  • రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
సామాన్యుడి అస్త్రం / హఫీజ్‌పేట్ : ప్రజలకు అందుతున్న ప్రభుత్వ వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావివ్వొద్దని రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్‌ స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. హఫీజ్‌పేట్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి, కేంద్రంలో అందుతున్న వైద్య సేవల తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీలో భాగంగా వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించిన డీఎంహెచ్‌వో.. రోజువారీ ఓపీ సేవలు, రోగుల నమోదు, మందుల లభ్యత, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందుతున్న సేవలను తెలుసుకోవడంతోపాటు సిబ్బంది పనితీరు, కేంద్రంలోని పరిశుభ్రతను కూడా పరిశీలించారు.
ప్రతి రోగికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులతోపాటు ఆరోగ్యపరమైన సలహాలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులను అనవసరంగా వేచి ఉండేలా చేయకుండా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మందుల కొరత తలెత్తకుండా ఎప్పటికప్పుడు నిల్వలను పరిశీలించడంతోపాటు రికార్డులను పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రజలకు పూర్తిస్థాయిలో చేరవేయాలని డాక్టర్‌ స్వర్ణ కుమారి పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లే ప్రధాన వైద్య ఆధారమని, అందువల్ల ఇక్కడ సేవల విషయంలో అలసత్వం ఉండకూడదని హెచ్చరించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో పట్టణ ఆరోగ్య కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ఆరోగ్య శాఖ లక్ష్యమని ఆమె తెలిపారు. తనిఖీలో జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి అక్రమ్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ అధికారి డాక్టర్‌ జ్యోతి బాయి పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder