- అర్హత లేకుండానే సెలైన్లు, ఇంజెక్షన్లు, కుట్లు
- జూబ్లీహిల్స్ జోన్‌లో ఆరుగురు నకిలీ వైద్యుల అరెస్ట్
- 600కు పైగా కేసులు నమోదైనా ఆగని అక్రమ వైద్యం
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్:
మెడలో స్టెతస్కోప్... ముందు మందుల సీసాలు... బయట క్లినిక్ బోర్డు! చూసేవారికి నిజమైన వైద్యుడేనన్న నమ్మకం. కానీ లోపల వైద్య విద్య లేదు... గుర్తింపు పొందిన అర్హత లేదు... అధికారిక రిజిస్ట్రేషన్ అంతకన్నా లేదు. అయినప్పటికీ జ్వరానికి మాత్రల నుంచి సెలైన్లు, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ వరకు ఇచ్చేస్తున్నారు. అవసరమైతే గాయాలకు కుట్లు కూడా వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల దందా హైదరాబాద్‌లో మరోసారి వెలుగులోకి వచ్చింది.
జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఆరుగురు నకిలీ వైద్యులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రహమత్‌నగర్, వెంకటగిరి, ఫిల్మ్‌నగర్, బోరబండ పరిసర ప్రాంతాల్లో వీరు క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో వైద్యం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
రోజుకు 50 మంది… రూ.200 వరకు ఫీజు!
వీరిలో కొందరు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరుతో పూర్తిస్థాయి వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరికొందరు నర్సింగ్, అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి విభాగాల్లో పనిచేసిన అనుభవాన్నే వైద్య అర్హతగా మార్చుకున్నట్లు సమాచారం. కనీస వైద్య విద్య లేకున్నా జ్వరం, నొప్పులు, డీహైడ్రేషన్, చిన్నపిల్లల అనారోగ్యాలకు చికిత్స చేస్తున్నట్లు వెల్లడైంది.
ఒక్కో క్లినిక్‌కు రోజుకు 10 నుంచి 50 మంది వరకు రోగులు వస్తుండగా, ఒక్కొక్కరి నుంచి రూ.50 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేదలు, వలస కార్మికులు, సమీప బస్తీల ప్రజలే వీరి వద్దకు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ఫీజు, ఇంటికి దగ్గరగా వైద్యం లభిస్తుందనే నమ్మకాన్ని వీరు సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గడువు ముగిసిన మందులతో చికిత్స!
దాడుల సందర్భంగా సెలైన్ బాటిళ్లు, సిరంజీలు, ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్, స్టెతస్కోప్‌లు, బీపీ యంత్రాలు, సర్జికల్ పరికరాలు, ప్రిస్క్రిప్షన్ పుస్తకాలు, గడువు ముగిసిన మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు.
వైద్యుల పర్యవేక్షణ లేకుండా సెలైన్ పెట్టడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇంజెక్షన్లు వేయడం తీవ్ర దుష్పరిణామాలకు దారితీయవచ్చు. మందుల వల్ల అలర్జీ లేదా ఇతర సమస్య తలెత్తితే అత్యవసర చికిత్స అందించే వ్యవస్థ కూడా ఈ క్లినిక్‌లలో ఉండదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
600 కేసులు నమోదైనా దందా ఎలా కొనసాగుతోంది?
నగరంలో ఇప్పటివరకు 600కు పైగా నకిలీ వైద్యులపై కేసులు నమోదైనట్లు సమాచారం. అయినప్పటికీ కొత్త పేర్లు, కొత్త బోర్డులతో అక్రమ క్లినిక్‌లు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నకిలీ వైద్యులపై అప్పుడప్పుడు దాడులు చేయడం మాత్రమే కాకుండా, వారికి మందులు సరఫరా చేస్తున్న మెడికల్ దుకాణాలు, భవనాలు అద్దెకు ఇస్తున్నవారు, అక్రమ క్లినిక్‌లను పట్టించుకోని సంబంధిత అధికారుల పాత్రపైనా విచారణ జరగాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
క్లినిక్ ప్రారంభించిన వెంటనే వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్, అనుమతులను పరిశీలించే పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదన్నది ప్రధాన ప్రశ్న. వందల కేసులు నమోదైన తర్వాత కూడా దందా కొనసాగుతుంటే కేవలం నకిలీ వైద్యులనే కాకుండా, వారిని పెంచిపోషిస్తున్న వ్యవస్థలోని లోపాలను కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది.
బోర్డు కనిపిస్తే వైద్యుడని నమ్మొద్దు!
ప్రజలు చికిత్స తీసుకునే ముందు వైద్యుడి విద్యార్హత, మెడికల్ రిజిస్ట్రేషన్, క్లినిక్ అనుమతులను పరిశీలించాలి. అనుమానం ఉంటే సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ముఖ్యంగా అర్హత లేని వ్యక్తులు సెలైన్, ఇంజెక్షన్, యాంటీబయాటిక్ మందులు ఇవ్వడం లేదా గాయాలకు కుట్లు వేయడం అత్యంత ప్రమాదకరం.