GHMC

పోలింగ్‌ కేంద్రం దూరమా?.. కారణాలతో ప్రతిపాదనలు ఇవ్వండి: అధికారుల పిలుపు

పోలింగ్‌ కేంద్రం దూరమా?.. కారణాలతో ప్రతిపాదనలు ఇవ్వండి: అధికారుల పిలుపు
  • గాజులరామారం సర్కిల్‌లో ‘ఎస్‌ఐఆర్‌’పై రాజకీయ పార్టీల సమావేశం
  • కొత్త పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌ల హేతుబద్ధీకరణపై కీలక చర్చ
  • కేంద్రాల మార్పు సూచనలను సరైన కారణాలతో సమర్పించాలని విజ్ఞప్తి

సామాన్యుడి అస్త్రం / గాజులరామారం: ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా, అందుబాటులో ఉండే ప్రదేశాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గాజులరామారం సర్కిల్‌లో అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. గాజులరామారం పరిధిలో ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాల పరిస్థితి, ఓటర్లకు వాటి అందుబాటు, కొత్త కేంద్రాల ఏర్పాటు అవసరం, కేంద్రాల హేతుబద్ధీకరణ, స్థల మార్పు వంటి అంశాలు సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. వేగంగా పెరుగుతున్న జనాభా, కొత్త కాలనీల ఏర్పాటు, ఓటర్ల సంఖ్యలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పరిశీలించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. ఏదైనా పోలింగ్‌ కేంద్రం ఓటర్లకు దూరంగా ఉన్నా, భవనం అందుబాటులో లేకపోయినా లేదా కేంద్రాన్ని మరింత సౌకర్యవంతమైన ప్రదేశానికి మార్చాల్సిన అవసరం ఉన్నా లిఖితపూర్వకంగా సూచనలు అందించాలని అధికారులు కోరారు. కేంద్రం మార్పు లేదా కొత్త బూత్‌ ఏర్పాటు ప్రతిపాదనలతోపాటు అందుకు తగిన కారణాలు, ప్రత్యామ్నాయ ప్రదేశం వివరాలను కూడా సమర్పించాలని సూచించారు.


రాజకీయ పార్టీల నుంచి అందే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఓటర్ల సౌకర్యం, భద్రత, పోలింగ్‌ కేంద్రంలో కనీస వసతులు, అందరికీ సమానంగా అందుబాటులో ఉండటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఈఆర్వో, డిప్యూటీ కమిషనర్‌ యు.వెంకటరాములు, ఏఈఆర్వో–ఏఎంసీ ప్రమీల, అధికారి సుమిత్ర, ఎన్నికల సూపరింటెండెంట్‌ బి.బాలకృష్ణతోపాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. తప్పులులేని ఓటర్ల జాబితా, సౌకర్యవంతమైన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు అన్ని పార్టీలు సహకరించాలని అధికారులు కోరారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder