- శేరిలింగంపల్లి జోన్‌లో రాజకీయ పార్టీలతో సర్వపక్ష సమావేశం
- ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 10 వరకు గడువు
- పార్టీల సూచనలతో పారదర్శకంగా చర్యలు చేపడతామని ఈఆర్వో హామీ
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్ సూచించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని సమావేశంలో సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు సమావేశానికి హాజరై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులు, పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ల నుంచి వస్తున్న సందేహాలను వివరించారు. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆగస్టు 10 చివరి తేదీ కావడంతో ఓటర్ల వివరాల సేకరణ, నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నారాయణ్ అమిత్ అధికారులను ఆదేశించారు. ఓటరు పేరు, చిరునామా, ఇతర వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఒక్క అర్హుడి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

అయితే, ఆగస్టు 10తో మొత్తం సవరణ ప్రక్రియ ముగియదు. ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ దశ మాత్రమే ముగుస్తుంది. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా, సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా ప్రచురించేలా షెడ్యూల్ రూపొందించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితా సవరణపై పలు సూచనలు చేశారు. వాటిని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా పారదర్శక చర్యలు తీసుకుంటామని ఈఆర్వో హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే పునాది కావడంతో రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.