- సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమికే చర్యలు పరిమితమన్న హైడ్రా
- రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలోనే 19 ఎకరాలకు కంచె వేసినట్లు వెల్లడి
- సుధారాణి స్థలంలోకి ప్రవేశించలేదని, గోడను కూల్చలేదని స్పష్టీకరణ
సామాన్యుడి అస్త్రం / కొండాపూర్: ప్రైవేటు స్థలంలోని హద్దుగోడను కూల్చివేశారంటూ వెలువడిన ఆరోపణలపై హైడ్రా ఘాటుగా స్పందించింది. కొండాపూర్ సర్వే నంబర్ 60లోకి తమ సిబ్బంది అడుగుపెట్టలేదని, తమ చర్యలన్నీ సర్వే నంబర్ 59లోని ప్రభుత్వ భూమికే పరిమితమయ్యాయని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్తికి నష్టం కలిగించామన్న ఆరోపణలను పూర్తిగా ఖండించింది.
సర్వే నంబర్ 59లోని దాదాపు 19 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు రెవెన్యూ అధికారులు తమ సహకారాన్ని కోరారని హైడ్రా తెలిపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే ఆ స్థలానికి కంచె ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. భూమి హద్దులను నిర్ణయించడం, సర్వే చేయడం పూర్తిగా రెవెన్యూ అధికారుల పరిధిలోనే జరిగిందని వివరించింది.
రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల రెవెన్యూ అధికారి, సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, పోలీసుల సమక్షంలోనే కంచె పనులు చేపట్టినట్లు తెలిపింది. రెవెన్యూ అధికారులు చూపించిన హద్దుల మేరకే తాము పనిచేశామని, భూమి సరిహద్దులపై హైడ్రా స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అయితే, సర్వే నంబర్ 60లోని తన 350 చదరపు గజాల స్థలానికి చెందిన హద్దుగోడను కంచె ఏర్పాటు సమయంలో హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చివేశారంటూ పి.సుధారాణి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆరోపణను తిరస్కరించిన హైడ్రా, సర్వే నంబర్ 60లోకి ప్రవేశించలేదని పునరుద్ఘాటించింది.

ప్రభుత్వ భూమిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త నిల్వచేస్తున్న తాత్కాలిక షెడ్డును మాత్రమే తొలగించినట్లు తెలిపింది. ఆపరేషన్‌కు ముందు లేదా తర్వాత సుధారాణి తమను సంప్రదించలేదని పేర్కొంది. ప్రస్తుతం వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉన్నందున రెవెన్యూ రికార్డులు, సర్వే హద్దులు, క్షేత్రస్థాయి ఆధారాల పరిశీలనతోనే వివాదంపై స్పష్టత రానుంది.