- ప్రముఖ ఉత్సవ కమిటీల పేరుతో నకిలీ విరాళాల ప్రచారం
- తక్కువ ధరకే విగ్రహాలు, పూజా సామగ్రి అంటూ మోసాలు
- లాటరీలు, లక్కీడ్రా లింకులతో భక్తుల బ్యాంకు ఖాతాలే లక్ష్యం
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : వినాయక నవరాత్రులకు నగరం సిద్ధమవుతుంటే.. భక్తుల జేబులు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త వల విసురుతున్నారు. ప్రముఖ గణేశ్ ఉత్సవ కమిటీల పేరుతో విరాళాలు, మార్కెట్ ధర కంటే తక్కువకే విగ్రహాలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, లడ్డూ ప్రసాదం హోం డెలివరీ అంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో గణేశ్ విగ్రహాలు, డెకరేషన్ సామగ్రి కోసం వెతికే వారికి తమ నంబర్లు, ప్రకటనలు ముందుగా కనిపించేలా సైబర్ ముఠాలు పథకం వేస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫొటోలు, భారీ డిస్కౌంట్లు చూపిస్తూ వినియోగదారులను సంప్రదించేలా చేస్తున్నాయి. ఒక్కసారి ఫోన్ చేస్తే బుకింగ్ అడ్వాన్స్, డెలివరీ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్, డెలివరీ బాయ్ గ్యారంటీ అంటూ విడతలవారీగా డబ్బు వసూలు చేసి చివరకు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్సవ కమిటీల పేరుతో నకిలీ చందాలు
నగరంలో గణపతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండటంతో కొన్ని వారాల ముందునుంచే విరాళాల సేకరణ, విగ్రహాల కొనుగోలు, మండపాల అలంకరణ మొదలవుతాయి. ఇదే అదనుగా భావిస్తున్న మోసగాళ్లు ప్రముఖ ఉత్సవ కమిటీల పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు, రీల్స్, క్యూఆర్ కోడ్‌లు సృష్టించి చందాలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఉత్సవ కమిటీ కార్యాలయానికి వెళ్లలేని భక్తులను లక్ష్యంగా చేసుకొని “ఆన్‌లైన్‌లో విరాళం పంపండి” అంటూ ఫోన్ నంబర్లు, చెల్లింపు లింకులు ప్రచారం చేస్తున్నారు. అవి నిజమైనవో కాదో పరిశీలించకుండా డబ్బు పంపితే తిరిగి పొందడం కష్టమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
చౌక ధరలే మోసగాళ్ల ఎర
మార్కెట్ ధర కంటే ఐదారు రెట్లు తక్కువకే విగ్రహాలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు ఇంటికే పంపిస్తామనే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అసాధారణంగా తక్కువ ధర కనిపిస్తే ముందుగా విక్రేత చిరునామా, ఫోన్ నంబర్, వెబ్‌సైట్, వినియోగదారుల సమీక్షలను పరిశీలించాలని చెబుతున్నారు.
ఉత్సవాల పేరుతో వచ్చే లాటరీలు, లక్కీడ్రాలు, ఉచిత బహుమతుల లింకులపై క్లిక్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. తెలియని లింకుల్లో బ్యాంకు ఖాతా, కార్డు, యూపీఐ లేదా ఓటీపీ వివరాలు నమోదు చేయవద్దని సూచిస్తున్నారు.
మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయండి
ఆన్‌లైన్ మోసం జరిగిన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి. ఆలస్యం చేయకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయాలి. చెల్లింపు రసీదులు, ఫోన్ నంబర్లు, చాట్ వివరాలు, ప్రకటనల స్క్రీన్‌షాట్లు, లావాదేవీ ఐడీలను భద్రపరచుకోవాలి. సకాలంలో ఫిర్యాదు చేస్తే నగదు బదిలీని నిలిపివేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
గణేశ్ ఉత్సవ కమిటీలకు విరాళాలు ఇవ్వాలనుకునేవారు వీలైనంత వరకు మండపాన్ని నేరుగా సందర్శించి, నిర్వాహకుల వివరాలు నిర్ధారించుకున్న తర్వాతే చెల్లించాలని సూచిస్తున్నారు.