Telangana

ఫీజు బకాయిలపై భిక్షాటన.. విద్యార్థుల భవిష్యత్‌తో సర్కార్‌ చెలగాటమా?

ఫీజు బకాయిలపై భిక్షాటన.. విద్యార్థుల భవిష్యత్‌తో సర్కార్‌ చెలగాటమా?
  • పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌
  • మదీనాగూడ నుంచి చందానగర్‌ వరకు తెలంగాణ రక్షణ సేన మహాధర్నా, ర్యాలీ
  • రూ.5 లక్షల ప్రమాద బీమా, స్కూటీల పంపిణీ హామీలను అమలు చేయాలి: వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : విద్యార్థుల చదువుకు భరోసాగా నిలవాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం బకాయిల ఊబిలో చిక్కుకుందని తెలంగాణ రక్షణ సేన నాయకులు మండిపడ్డారు. నెలల తరబడి నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ సోమవారం మహాధర్నా, ర్యాలీ నిర్వహించారు.
తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మదీనాగూడ గాంధీ సర్కిల్‌ నుంచి చందానగర్‌ ఓల్డ్‌ గాంధీ సర్కిల్‌ వరకు విద్యార్థులు, నాయకులు ర్యాలీ చేపట్టారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం రోడ్డుపై భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను నిలిపివేయడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలు రాక కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని, చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.5 లక్షల ప్రమాద బీమా, స్కూటీల పంపిణీతో పాటు ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రభుత్వం ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కుమార్‌, దయానంద్‌ ముదిరాజ్‌, సందీప్‌ డిసోజు, విష్ణు, రఘు, పవన్‌తో పాటు విద్యార్థులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder