- భాగ్యలక్ష్మీ కాలనీలో పది మంది యువకుల వీరంగం
- డ్రైవర్ ఆకాష్‌పై బీరు సీసాలు, కట్టెలతో విచక్షణారహిత దాడి
- ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
సామాన్యుడి అస్త్రం / మేడ్చల్ : గంజాయి మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుల బృందం ఓ ర్యాపిడో కారు డ్రైవర్‌పై దారుణంగా దాడికి పాల్పడిన ఘటన మేడ్చల్ ప్రాంతంలో కలకలం రేపింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో జరిగిన ఈ దాడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అందిన సమాచారం ప్రకారం.. రోడ్డుపై కారులో వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ ఆకాష్‌ను సుమారు పది మంది యువకులు అడ్డుకున్నారు. తమకు గంజాయి కావాలంటూ అతడితో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. తన వద్ద గంజాయి లేదని ఆకాష్ చెప్పడంతో ఆగ్రహానికి గురైన యువకులు ఒక్కసారిగా అతడిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న యువకులు బీరు సీసాలతో ఆకాష్‌ను విచక్షణారహితంగా కొట్టారని సమాచారం. ఈ దాడిలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతోపాటు చేయి విరిగినట్లు తెలుస్తోంది. దెబ్బలు తట్టుకోలేక ఆకాష్ సమీపంలో ఉన్న తన గదివైపు పరుగెత్తినా దుండగులు వదల్లేదు.
అతడిని వెంబడిస్తూ ఇంటి ఆవరణలోకి చొరబడిన యువకులు అక్కడున్న కట్టెలను తీసుకుని మరోసారి దాడి చేసినట్లు సమాచారం. రోడ్డుపై మొదలైన గొడవ ఇంటి ఆవరణ వరకూ కొనసాగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
జనావాసాల మధ్య పది మంది యువకులు ఇంతటి దౌర్జన్యానికి పాల్పడటం స్థానిక భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక ప్రకటన ఇంకా వెల్లడికావాల్సి ఉంది.