Telangana

తెలుగు నుడికారానికి గిడుగు–కాళోజీ రెండు వెలుగులు!

తెలుగు నుడికారానికి గిడుగు–కాళోజీ రెండు వెలుగులు!
  • భాషా సేవలో వారి కృషి తరతరాలకు స్ఫూర్తి: ఆచార్య పిల్లలమర్రి రాములు
  • హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో తెలంగాణ భాషా దినోత్సవం
  • గిడుగు, కాళోజీ సేవలను స్మరించుకున్న తెలుగు శాఖ
  • అన్ని ప్రాంతాల భాషలకు సముచిత గౌరవం ఇవ్వాలని పిలుపు
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం : తెలుగు వ్యావహారిక భాషకు గిడుగు రామ్మూర్తి పంతులు, తెలంగాణ ప్రజల నుడికారానికి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు పేర్కొన్నారు. తెలంగాణ భాషకు సజీవ రూపాన్నిచ్చిన ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు.
తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంతితోపాటు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి కార్యక్రమాన్ని హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు, కాళోజీ చిత్రపటాలకు అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ.. ప్రజలు మాట్లాడే భాషకు పట్టం కట్టిన గిడుగు, తెలంగాణ జీవన విధానాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించిన కాళోజీ తెలుగు సమాజానికి రెండు వెలుగులని అభివర్ణించారు. భాష విషయంలో ప్రాంతీయ వివక్షకు తావుండకూడదని, అన్ని ప్రాంతాల ప్రజల భాషకు సముచిత గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అన్ని భాషలను, మాండలికాలను గౌరవించడమే కాళోజీకి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
తెలంగాణ రచయితల వేదిక మహాసభల్లో కాళోజీ చేసిన ప్రసంగంలోని వివిధ అంశాలను ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. తెలంగాణ భాషకు, ఇక్కడి ప్రజల జీవన విధానానికి మధ్య విడదీయరాని అనుబంధం ఉందని కాళోజీ చెప్పిన తీరును ఉదాహరణలతో విశ్లేషించారు. ప్రజల జీవితాల్లోంచి పుట్టిన భాషే కాళోజీ కవిత్వానికి బలమని చెప్పారు.
గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తితోనే బంజారా భాషకు వ్యాకరణం రచించాలనే ఆలోచన కలిగిందని ఆచార్య గోనా నాయక్‌ తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు సవర భాషతోపాటు తెలుగు వ్యావహారిక భాష అభివృద్ధికి చేసిన సేవలు నిరుపమానమైనవని డాక్టర్‌ బాణాల భుజంగరెడ్డి పేర్కొన్నారు.
కాళోజీ రచనల్లోని కవితా శక్తిని, ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఆయన కవిత్వం పోషించిన పాత్రను డాక్టర్‌ పి.విజయ్‌కుమార్‌ ఉదాహరణలతో వివరించారు. డాక్టర్‌ బాశెట్టి లత ఆహ్వానం పలికిన ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పమ్మి పవన్‌కుమార్‌, ఆచార్య పి.వారిజారాణి, ఆచార్య వంగరి త్రివేణి, పరిశోధకులు, ఎంఏ విద్యార్థులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder