- రాత్రింబవళ్లు పూడిక తొలగింపు.. నీటితో నింపేందుకు ముమ్మర చర్యలు
- ప్రధాన రహదారి వైపు చెరువును లోతుగా తవ్వుతున్న హైడ్రా
- మురుగు, ప్లాస్టిక్, పీఓపీ వ్యర్థాలతో నిండిపోయిన చెరువు అడుగుభాగం
- నిమజ్జనం అనంతరం 72 ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టే ప్రణాళిక
సామాన్యుడి అస్త్రం / కూకట్‌పల్లి : గణేష్ నిమజ్జనానికి సమయం దగ్గరపడుతున్న వేళ కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద హైడ్రా భగీరథ ప్రయత్నం చేస్తోంది. వేల సంఖ్యలో తరలివచ్చే గణనాథుల విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చెరువును లోతుగా తవ్వడంతోపాటు అవసరమైన నీటిని నింపేందుకు రాత్రింబవళ్లు పనులు చేపడుతోంది.
ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న చెరువు ప్రాంతాన్ని లోతుగా తవ్వుతున్న హైడ్రా అధికారులు.. దాదాపు 20 అడుగులకు పైగా పేరుకుపోయిన వ్యర్థాలతో కూడిన పూడికను తొలగిస్తున్నారు. పూడిక తొలగిస్తున్నకొద్దీ ఊట నీరు కూడా బయటకు వచ్చి చేరుతోందని అధికారులు చెబుతున్నారు. దీనికి అదనంగా చెరువులోని ఇతర ప్రాంతాల నుంచి నీటిని ఈ ప్రాంతానికి మళ్లించి, నిమజ్జనానికి సరిపడా నీటిమట్టం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పటికే ఐడీఎల్ చెరువును సందర్శించి పనులను పరిశీలించారు. చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకం కలగకుండా, నిమజ్జనానికి అవసరమైన నీరు చేరేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులతోపాటు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా కమిషనర్‌ను కలిసి నిమజ్జన ఏర్పాట్లు చేయాలని కోరినట్లు సమాచారం.
తవ్వినకొద్దీ బయటపడుతున్న ప్రమాదకర వ్యర్థాలు
ఐడీఎల్ చెరువులో పూడికను తొలగిస్తున్నకొద్దీ భారీగా వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఏళ్లుగా చెరువులోకి నేరుగా చేరుతున్న మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు, కొబ్బరి పీచు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవశేషాలు అడుగుభాగంలో గుట్టలుగా పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యర్థాలను తొలగించడంతోపాటు సురక్షితంగా తరలించడం అధికారులకు సవాల్‌గా మారింది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌లో ప్రధానంగా ఉండే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ నీటిలో కలిసినప్పుడు జిప్సంగా మారి చెరువు అడుగుభాగంలో పేరుకుపోతుందని అధికారులు వెల్లడించారు. దీని కారణంగా నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గడంతోపాటు చెరువు సహజ స్వరూపం దెబ్బతిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పీఓపీ, ప్లాస్టిక్, మురుగు వ్యర్థాల కారణంగా భూగర్భ జలాల పెరుగుదలకూ ఆటంకం ఏర్పడినట్లు చెబుతున్నారు.
తొలగించిన వ్యర్థాలను రాంకీ సంస్థ ద్వారా పర్యావరణానికి ముప్పు కలగకుండా తరలించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. లక్షల టన్నులుగా అంచనా వేస్తున్న పూడికను పూర్తిస్థాయిలో తొలగించేందుకు భారీ యంత్రాలతో పనులు కొనసాగుతున్నాయి.
గణేష్ నిమజ్జన సమయానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయడమే ప్రస్తుతం ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయిన అనంతరం మిగిలిన పూడిక మొత్తాన్ని తొలగించి, సుమారు 72 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐడీఎల్ చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా ప్రణాళిక సిద్ధం చేసింది.