Crime

చందానగర్ పార్కుపై కబ్జా ప్రయత్నాలకు హైడ్రా చెక్‌.. దశాబ్దాల పోరాటానికి శుభం కార్డు!

చందానగర్ పార్కుపై కబ్జా ప్రయత్నాలకు హైడ్రా చెక్‌.. దశాబ్దాల పోరాటానికి శుభం కార్డు!
  • హైకోర్టు ఆదేశాల మేరకు 400 గజాల పార్కు స్థలానికి రక్షణ
  • పార్కు చుట్టూ ఫెన్సింగ్‌ వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన హైడ్రా
  • ఏళ్ల తరబడి సాగించిన పోరాటం ఫలించడంతో కాలనీవాసుల హర్షం

సామాన్యుడి అస్త్రం / చందానగర్‌ : పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు హైడ్రా అడ్డుకట్ట వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని అర్జున్‌రెడ్డి కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ గురువారం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి, అది పార్కు స్థలమని స్పష్టంచేస్తూ బోర్డులు అమర్చింది. దశాబ్దాలుగా స్థల పరిరక్షణ కోసం పోరాడుతున్న కాలనీవాసులు హైడ్రా చర్యపై హర్షం వ్యక్తం చేశారు. చందానగర్‌ సర్వే నంబర్‌ 123లోని 3.24 ఎకరాల విస్తీర్ణంలో 41 ప్లాట్లతో 1995లో హుడా అనుమతి పొందిన లేఅవుట్‌ ఏర్పాటైంది. ఇందులో సుమారు 400 చదరపు గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ స్థలం తమదని పేర్కొంటూ కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించారని, వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చామని కాలనీవాసులు పేర్కొన్నారు.

హైకోర్టును ఆశ్రయించిన కాలనీవాసులు

పార్కు స్థలంతోపాటు లేఅవుట్‌లోని అంతర్గత రహదారులను పరిరక్షించాలని కోరుతూ అర్జున్‌రెడ్డి కాలనీ నివాసితులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. పార్కు, అంతర్గత రహదారుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీకి సూచిస్తూ 2022లో హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కాలనీవాసులు వెల్లడించారు. అయితే పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టడంలో జాప్యం జరగడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆక్రమణకు ప్రయత్నించినవారు పలుమార్లు జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలున్నప్పటికీ స్థలానికి భౌతిక రక్షణ లేకపోవడంతో పార్కు భవిష్యత్తుపై ఆందోళన కొనసాగింది.

ప్రజావాణి ఫిర్యాదుతో కదిలిన హైడ్రా

పార్కు చరిత్ర, హుడా అనుమతులు, హైకోర్టు తీర్పు, ఆక్రమణ ప్రయత్నాలకు సంబంధించిన వివరాలతో కాలనీవాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా అధికారులు పార్కు స్థలాన్ని పరిశీలించి, గురువారం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. పార్కు స్థలమని తెలియజేసే బోర్డులను కూడా అమర్చారు. హైడ్రా చర్యతో విలువైన సామాజిక స్థలం ఆక్రమణకు గురికాకుండా రక్షణ లభించిందని నివాసితులు సంతోషం వ్యక్తం చేశారు. దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందని, ఇక పార్కును అభివృద్ధి చేసి పిల్లలు, వృద్ధులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు.



Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder