Telangana

అంగన్‌వాడీ దరఖాస్తులకు సైట్‌ మొరాయిస్తే.. వెరిఫికేషన్‌ ఎలా చేస్తారు?

అంగన్‌వాడీ దరఖాస్తులకు సైట్‌ మొరాయిస్తే.. వెరిఫికేషన్‌ ఎలా చేస్తారు?
దరఖాస్తు గడువు పెంచాలి.. వెరిఫికేషన్‌ను తక్షణమే నిలిపివేయాలి
  • ఆన్‌లైన్‌ సైట్‌ పనిచేయక నిరుద్యోగులకు తీవ్ర ఇబ్బందులు
  • దరఖాస్తు చేసుకోకముందే వెరిఫికేషన్‌ నిర్వహించడంపై అభ్యంతరం
  • జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన జనసేన వీర మహిళలు
సామాన్యుడి అస్త్రం / కరీంనగర్ : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఆన్‌లైన్‌ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో అర్హులైన నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన పార్టీ వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు పూర్తిస్థాయిలో అవకాశం కల్పించకుండానే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టడం సరికాదంటూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
జనసేన పార్టీ నాయకుడు కాస రాజు ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకురాలు రాగుల శిరీష ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పటికీ, నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ సక్రమంగా పనిచేయడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.
సర్వర్‌, సాంకేతిక సమస్యల కారణంగా ఎంతోమంది అర్హులైన అభ్యర్థులు ఇప్పటికీ దరఖాస్తులు సమర్పించలేకపోయారని తెలిపారు. ఒకవైపు దరఖాస్తు ప్రక్రియ పూర్తికాకపోగా, మరోవైపు వెరిఫికేషన్‌ నిర్వహించడం అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు. సాంకేతిక లోపాలకు నిరుద్యోగులను బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అర్హులైన ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా ప్రస్తుతం కొనసాగుతున్న వెరిఫికేషన్‌ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ సమస్యలను పూర్తిగా పరిష్కరించి, దరఖాస్తుల సమర్పణకు మరికొన్ని రోజుల గడువు ఇవ్వాలని కోరారు. అనంతరం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ సమాన అవకాశం కల్పిస్తూ పారదర్శకంగా వెరిఫికేషన్‌ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కందుల రాజిరెడ్డి, వీర్ల శ్రీనివాసరావు, పొన్నాల తిరుపతి, శకుంతల, మహాదేవుని రాజకుమార్, పుప్పాల అన్వేష్‌రెడ్డి, జంగ మహేష్, సృజన్‌తో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder