- ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల స్టైపెండ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
- మాటలతో సరిపెట్టకుండా అధికారిక జీవో విడుదల చేయాలని స్పష్టీకరణ
- న్యాయం జరిగే వరకు యువ వైద్యులకు అండగా ఉంటామని జనసేన తెలంగాణ ప్రకటన
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు చేస్తున్న న్యాయమైన స్టైపెండ్ పోరాటానికి జనసేన పార్టీ తెలంగాణ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వైద్య విద్యను అభ్యసిస్తూ ఆసుపత్రుల్లో సేవలందిస్తున్న యువ వైద్యుల సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఆయుష్ యువ వైద్యుల స్టైపెండ్‌కు సంబంధించి కేవలం హామీలు ఇవ్వడం కాకుండా స్పష్టమైన నిర్ణయంతో అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. ఇతర వైద్య విభాగాలతో సమానంగా తమకు న్యాయమైన స్టైపెండ్ చెల్లించాలని కోరుతున్న హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
యువ వైద్యుల శ్రమకు గుర్తింపు ఏది?
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయుష్ యువ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న వారికి సముచిత స్టైపెండ్ చెల్లించడం న్యాయమైన హక్కని పేర్కొన్నారు. స్టైపెండ్ సమస్యపై ప్రభుత్వం చర్చలు, హామీలతో కాలయాపన చేయకుండా అమలుకు స్పష్టమైన గడువుతో జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్ వైద్యుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు జనసేన పార్టీ తెలంగాణ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు.
హామీలు కాదు.. జీవో కావాలి!
ఆయుష్ హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం సాధారణ ఆర్థిక అంశంగా చూడకూడదని జనసేన నాయకులు అభిప్రాయపడ్డారు. యువ వైద్యుల ఆత్మగౌరవం, వారి సేవలకు దక్కాల్సిన గుర్తింపుతో ముడిపడిన సమస్యగా పరిగణించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి, డాక్టర్ మణికంఠ గౌడ్, తనూజారెడ్డి, ప్రవీణ్ సాహూ, అనుపమ, కేశవరావు, గోపితోపాటు జనసైనికులు పాల్గొని ఆయుష్ వైద్యులకు సంఘీభావం తెలిపారు. న్యాయమైన స్టైపెండ్ అమలయ్యే వరకు తమ పోరాటానికి మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు.