Telangana

మియాపూర్‌లో వరద ముప్పుకు చెక్‌ ఎప్పుడు?.. ఎఫ్‌సీఐ కాలనీ–పటేల్ చెరువు డ్రెయిన్‌కు కసరత్తు!

మియాపూర్‌లో వరద ముప్పుకు చెక్‌ ఎప్పుడు?.. ఎఫ్‌సీఐ కాలనీ–పటేల్ చెరువు డ్రెయిన్‌కు కసరత్తు!
  • ఎఫ్‌సీఐ కాలనీ నుంచి పటేల్ చెరువు ఔట్‌లెట్‌ వరకు కొత్త వరదనీటి కాలువ
  • శాస్త్రీయ ప్రణాళికతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచన
  • ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికుల విజ్ఞప్తి

సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : వర్షాకాలం వచ్చిందంటే ఎఫ్‌సీఐ కాలనీతోపాటు పరిసర ప్రాంతాలను వెంటాడుతున్న వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎఫ్‌సీఐ కాలనీ నుంచి పటేల్ చెరువు ఔట్‌లెట్‌ వరకు నూతనంగా నిర్మించనున్న స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్‌ ప్రతిపాదిత మార్గాన్ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ డీఈ శ్రీదేవి, మాజీ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, స్థానిక నాయకులు పరిశీలించారు.

ప్రతిపాదిత కాలువ వెళ్లే మార్గం, వరదనీరు ప్రవహించే దిశ, పటేల్ చెరువు ఔట్‌లెట్‌తో అనుసంధానం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువ నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలను పాటించడంతోపాటు మధ్యలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా సరైన వాలు, తగిన వెడల్పు, లోతుతో ప్రణాళిక రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తించారు.

పటేల్ చెరువుకు సాఫీగా వరదనీరు

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్‌ మాట్లాడుతూ ఎఫ్‌సీఐ కాలనీ నుంచి వచ్చే వరదనీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా పటేల్ చెరువులోకి చేరేలా కాలువ నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్యను వాయిదా వేయకుండా భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసినా ముంపు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని సూచించారు.


ఈ డ్రెయిన్‌ నిర్మాణం పూర్తయితే ఎఫ్‌సీఐ కాలనీ, సమీప నివాస ప్రాంతాలు, అనుసంధాన రహదారుల్లో వర్షాకాలంలో ఏర్పడే నీటినిల్వ, రాకపోకల అంతరాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే కాలువలోకి చెత్త, మురుగునీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతోపాటు నిర్మాణం పూర్తయిన తర్వాత నిరంతర నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని స్థానికులు కోరుతున్నారు.

పనుల్లో జాప్యం జరగకుండా చూడాలి

క్షేత్రస్థాయి పరిశీలనతోనే సరిపెట్టకుండా అవసరమైన సాంకేతిక అంచనాలు, అనుమతులు, నిధుల ప్రక్రియను వేగంగా పూర్తిచేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలం సమీపించేలోగా కీలక పనులు పూర్తయితేనే ముంపు నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.

ఈ పరిశీలనలో స్థానిక నాయకులు మహమ్మద్‌ ఖాజా, ఉమాకిషన్‌, ఏఈ ప్రశాంత్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు జగదీష్‌, అన్వర్‌తోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder