Telangana

జిన్నారం బోనాల జాతర.. అమ్మవారికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు

జిన్నారం బోనాల జాతర.. అమ్మవారికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు
  • టీం భజరంగ్ ఆధ్వర్యంలో వైభవంగా బోనాలు, తొట్టెల ఊరేగింపు
  • పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
  • ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి

సామాన్యుడి అస్త్రం / జిన్నారం: తెలంగాణ సంప్రదాయాల పరిమళం, భక్తుల సందడితో జిన్నారం మున్సిపల్ కేంద్రం గురువారం కళకళలాడింది. టీం భజరంగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ, తొట్టెల ఊరేగింపు కార్యక్రమం భక్తి, సంస్కృతుల సమ్మేళనంగా సాగింది. ఈ వేడుకలకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానికులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.తొలుత పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో మమేకమైన ఆయన బోనాల ఉత్సవ విశిష్టతను వివరించారు. ఆషాఢ మాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, గ్రామీణ జీవన విధానానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.బోనాలు కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదని, తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ ప్రజల సామూహిక జీవన సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలంతా ఐక్యతతో పండుగలు నిర్వహించుకోవడం ద్వారా సమాజంలో సోదరభావం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. స్థానిక నాయకులు, భక్తులు, యువకులతో కలిసి ఊరేగింపులో పాల్గొని ఉత్సవ నిర్వాహకులను అభినందించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు, అందించిన సేవలు తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, సీనియర్ నాయకుడు వెంకటేష్‌గౌడ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, టీం భజరంగ్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder