- ఎకరానికి రూ.136.50 కోట్లతో వజ్రా హౌసింగ్ రికార్డు బిడ్
- రూ.626 కోట్లకుపైగా చెల్లించలేక వెనక్కి తగ్గినట్లు సమాచారం
- రూ.5 కోట్ల ఈఎండీ జప్తు.. తాజా వేలానికి హెచ్‌ఎండీఏ కసరత్తు
సామాన్యుడి అస్త్రం / కోకాపేట : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన కోకాపేట నియోపోలిస్ భూముల వేలంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేజ్–3 పరిధిలోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న 4.59 ఎకరాల భూమిని మరోసారి వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2025 నవంబర్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఈ-వేలంలో వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీ ఎకరానికి రూ.136.50 కోట్ల చొప్పున బిడ్ వేసి ప్లాట్‌ను దక్కించుకుంది. మొత్తం భూమి విలువ సుమారు రూ.626.53 కోట్లకు చేరింది. ఎకరానికి రూ.99 కోట్ల కనీస ధరతో ప్రారంభమైన వేలం భారీ పోటీ మధ్య రికార్డు స్థాయికి చేరినట్లు అప్పటి అధికారిక వేలం వివరాలు వెల్లడించాయి.
రికార్డు బిడ్.. చెల్లింపుల్లో బ్రేక్!
అయితే, నిర్ణీత గడువులో భారీ మొత్తాన్ని సమకూర్చడం సాధ్యం కాదని వజ్రా సంస్థ వెనక్కి తగ్గినట్లు రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో వేలంలో పాల్గొనేందుకు సంస్థ చెల్లించిన రూ.5 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌ను నిబంధనల ప్రకారం హెచ్‌ఎండీఏ జప్తు చేసినట్లు సమాచారం. నియోపోలిస్‌లో ప్రతి ప్లాట్‌కు రూ.5 కోట్ల ఈఎండీని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. వజ్రా సంస్థ సామర్థ్యానికి మించి దూకుడుగా బిడ్ చేసిందని, చెల్లింపుల దశలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వేలం సమయంలోనే కొందరు రియల్టీ నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో ఆ అనుమానాలు మరోసారి చర్చకు వచ్చాయి.
పునర్వేలంలో ధర నిలుస్తుందా?
నిబంధనలను అనుసరించి ప్లాట్ నంబర్ 17ను తాజా వేలానికి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పునర్వేలం తేదీ, కనీస ధరపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో క్రియాశీల వేలం నోటిఫికేషన్ కనిపించడం లేదు.