- సూర్య గ్లోబల్ స్కూల్‌లో దేశభక్తి ఉట్టిపడేలా వేడుకలు
- గీతాలాపన, పోస్టర్ మేకింగ్ పోటీల్లో 500 మందికి పైగా విద్యార్థులు
- విజేతలకు బహుమతులు.. పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు
సామాన్యుడి అస్త్రం / బాచుపల్లి : జాతీయ భావాలను చాటుతూ, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో 150 ఏళ్ల ‘వందేమాతరం’ వేడుకలను బాచుపల్లిలో ఘనంగా నిర్వహించారు. సంస్కార భారతి కూకట్‌పల్లి సమితి ఆధ్వర్యంలో సూర్య గ్లోబల్ స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం దేశభక్తి నినాదాలు, విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో పాఠశాలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వందేమాతరం పూర్తి గీతాలాపనతో పాటు పోస్టర్ మేకింగ్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతకు పదునుపెడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమం, జాతీయ ఐక్యత, దేశభక్తిని ప్రతిబింబించేలా పోస్టర్లను రూపొందించారు. సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించిన సమయంలో పాఠశాల ప్రాంగణం జాతీయ స్ఫూర్తితో మార్మోగింది.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థినీ, విద్యార్థికి ప్రశంసాపత్రాలు అందించి ప్రోత్సహించారు. చదువుతోపాటు దేశ చరిత్ర, సంస్కృతి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను విద్యార్థులకు పరిచయం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి సంస్కార భారతి ప్రాంత కోశాధికారి, మాజీ సీనియర్ గర్ల్ క్యాడెట్ ఇన్‌స్ట్రక్టర్ (ఎన్‌సీసీ) సరోజ్ బాలా ఠాకూర్, సంస్కార భారతి రాష్ట్ర కార్యదర్శి భవాని కల్లేపు, సూర్య గ్లోబల్ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ సమీనా, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరయ్యారు.
వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఉత్తేజాన్నిచ్చిందని వక్తలు పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత, జాతీయ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఈ గీతం గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో దేశంపట్ల గౌరవం, సామాజిక బాధ్యతను పెంపొందించాలని సూచించారు.