Telangana

రైతు ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకోం!.. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఎంసీపీఐ(యు) గర్జన

రైతు ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకోం!.. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఎంసీపీఐ(యు) గర్జన
  • మియాపూర్‌ నుంచి ఆల్విన్‌ చౌరస్తా వరకు ‘జైల్‌ భరో’ ర్యాలీ
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
  • కేంద్రం స్పందించకపోతే ప్రజా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

సామాన్యుడి అస్త్రం / మియాపూర్‌ : భారత రైతాంగం, కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసే భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంసీపీఐ(యు) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌.చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా ఆగస్టు 10న మియాపూర్‌ క్రాస్‌రోడ్‌ నుంచి ఆల్విన్‌ చౌరస్తా వరకు నిర్వహించిన ప్రజాసంఘాల ‘జైల్‌ భరో’ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

కార్పొరేట్లకే దేశ సంపదా?

1991లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాలతో ప్రైవేటీకరణకు ద్వారాలు తెరుచుకున్నాయని చంద్రశేఖర్‌ విమర్శించారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా అదే విధానాలను వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తోందని ఆరోపించారు. కార్మిక చట్టాల్లో మార్పులు శ్రామికుల హక్కులను బలహీనపరుస్తున్నాయని పేర్కొన్నారు.

రైతాంగంపై వాణిజ్య ఉచ్చు!

అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను విస్తృతంగా తెరవడం వల్ల దేశీయ వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత సుంకాల విధానంలో సమానత్వం లేదని, ఇది దేశ ఆర్థిక ప్రయోజనాలు, సార్వభౌమత్వంపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. అమెరికా అధికారిక ప్రకటనల్లో భారతదేశం పలు అమెరికన్‌ పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం లేదా తొలగించడం ఈ వాణిజ్య చట్రంలో భాగమని పేర్కొన్నారు. 

వెనక్కి తగ్గకపోతే ఉద్యమమే

కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను రక్షిస్తూ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కూడా కేంద్ర ఆర్థిక విధానాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. కేంద్రం స్పందించకపోతే ప్రజా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో అరుణ్‌కుమార్‌, వనం సుధాకర్‌, కుంబం సుకన్య, తుడుం అనిల్‌కుమార్‌, తాండ్ర కళావతి, ఇస్లావత్‌ దశరథ్‌నాయక్‌, పల్లె మురళి, డి.రంగస్వామి, జి.శివాని, జి.లలిత, డి.నర్సింహ, బి.అరుణ, ఇషాక్‌, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder