ASTHRAM DAILY
Hyderabad

మున్సిపల్‌ పోరుకు సిద్ధంకండి!

  • ప్రజల్లో ఉండేవారికే ప్రాధాన్యం.. కష్టపడిన వారికి సముచిత స్థానం
  • జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌ నేమురి శంకర్‌ గౌడ్‌
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బలంగా పోటీ చేస్తామని వెల్లడి
  • వార్డులు, డివిజన్ల స్థాయిలో పార్టీ కమిటీల బలోపేతానికి పిలుపు
  • ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచన

సామాన్యుడి అస్త్రం / కూకట్‌పల్లి : తెలంగాణలో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన బలంగా పోటీ చేస్తుందని, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌ నేమురి శంకర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో జనసేన బలోపేతానికి అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ రాబోయే ఎన్నికల్లో సముచిత స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. కూకట్‌పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల సన్నద్ధతపై నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నేమురి శంకర్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్‌కే సాగర్‌, జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

స్థానిక సమస్యలపై పనిచేయాలి

ఈ సందర్భంగా శంకర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తమ పరిధిలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలన్నారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్పొరేషన్ల పరిధిలో వార్డులు, డివిజన్ల స్థాయిలో కమిటీలను బలోపేతం చేసి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక ఎన్నికలు దిక్సూచిగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల ఆదరణే అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక

ప్రజల్లో ఆదరణ ఉన్నవారికే రానున్న ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థులుగా ప్రాధాన్యం ఉంటుందని జాయినింగ్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తూ ఎదిగిన నాయకులకు అవకాశాలు దక్కుతాయని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు జనసేనలో చేరుతున్నారని, కొత్తగా వచ్చే వారికి స్వాగతం పలుకుతూ అందరూ కలిసి పార్టీ బలోపేతానికి పనిచేయాలని కోరారు. కష్టపడిన వారిని పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు.

ప్రతి డివిజన్‌లో పార్టీ బలం పెంచాలి

పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ప్రజలు, నాయకులు జనసేన వైపు చూస్తున్నారని రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్‌కే సాగర్‌ అన్నారు. ప్రతి నాయకుడు తన డివిజన్‌లో పార్టీ బలాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై అవగాహన పెంచుకోవడంతోపాటు వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. రాష్ట్ర నాయకుడు మచ్చా సుధాకర్‌ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూడకుండా ఎన్నికల సన్నద్ధత ప్రారంభించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా కేడర్‌ను సిద్ధం చేయాలన్నారు. తమ డివిజన్‌తోపాటు పక్క డివిజన్లలోనూ పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని, కమిటీలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామకృష్ణ, రాదరాం రాజలింగం, దామోదర్‌రెడ్డి, కావ్యతోపాటు జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Journalist
Jairam
Journalist

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder