- 70 ఎకరాల పట్టా భూములను స్వచ్ఛందంగా ఇచ్చేందుకు రైతుల అంగీకారం
- ఆక్రమణల తొలగింపుతో అదనంగా అందుబాటులోకి వచ్చిన 13 ఎకరాలు
- టీడీఆర్ పరిహారం త్వరగా అందించాలని రైతుల విజ్ఞప్తి
సామాన్యుడి అస్త్రం / నల్లగండ్ల : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని నల్లగండ్ల చెరువుకు కొత్త రూపు తీసుకొచ్చే పనులు ప్రారంభమయ్యాయి. రైతులతో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. నల్లగండ్ల చెరువు ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం 90 ఎకరాలు కాగా, ఇందులో దాదాపు 70 ఎకరాలు రైతులకు చెందిన పట్టా భూములుగా ఉన్నాయి. ఈ భూములు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండటంతో చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని హైడ్రా చేసిన విజ్ఞప్తికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గతంలోనే రైతులందరి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని హైడ్రాకు అందజేశారు. తాజాగా పనుల ప్రారంభ కార్యక్రమంలోనూ వారు భాగస్వాములయ్యారు.
చెరువు అభివృద్ధికి భూములు ఇచ్చిన తమకు ప్రభుత్వం టీడీఆర్ రూపంలో నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు హైడ్రా కమిషనర్‌ను కోరారు. చెరువు కట్టపై ఉన్న పురాతన అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించుకునేందుకు వీలుగా ఆలయం చుట్టూ తగినంత స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. టీడీఆర్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా ప్రయత్నిస్తామని, ఆలయానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉంచుతామని రంగనాథ్ హామీ ఇచ్చారు. ఆక్రమణలను తొలగించడంతో చెరువుకు మరో 13 ఎకరాల స్థలం అదనంగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కలిపి మొత్తం 103 ఎకరాల పరిధిలో చెరువును అభివృద్ధి చేసేందుకు హైడ్రా ప్రణాళిక సిద్ధం చేసింది.
చెరువుకు ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉండటంతో అటువైపు నుంచి వచ్చే వరదనీరు నేరుగా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను పటిష్ఠం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఔట్‌లెట్లను మెరుగుపరచడంతోపాటు పేరుకుపోయిన పూడికను తొలగించి, చెరువును మరింత లోతుగా తవ్వి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. చెరువు చుట్టూ పచ్చదనం, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. చెరువు అభివృద్ధి ప్రణాళికను విమోస్ టెక్నోక్రాట్స్ డైరెక్టర్ యూనస్ కమిషనర్‌కు వివరించారు. కార్యక్రమంలో హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య, అదనపు కమిషనర్ డి.ఆనంద్‌కుమార్, ఏసీపీలు పుప్పాల తిరుమల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పరిసర అపార్ట్‌మెంట్ల నివాసితులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై చెరువు పునరుద్ధరణ చర్యలను అభినందించారు.

