- ఆగస్టు 7 నుంచి 14 మధ్య వీధి కుక్కల వరుస అనుమానాస్పద మరణాలు
- మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో FIR.. CCTV దృశ్యాలు పరిశీలించాలని డిమాండ్
- పోస్టుమార్టం, టాక్సికాలజీ నివేదికలు లేకపోవడంతో తేలని అసలు కారణం
సామాన్యుడి అస్త్రం / మియాపూర్ : మియాపూర్ సర్కిల్–48 పరిధిలోని దీప్తిశ్రీనగర్‌లో వీధి కుక్కల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కమ్యూనిటీ పార్కు, రోడ్ నంబర్–14 పరిసరాల్లో ఆగస్టు 7 నుంచి 14 మధ్య పలు కుక్కలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందగా, మరికొన్ని రాత్రికి రాత్రే కనిపించకుండా పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకే ప్రాంతంలో, కొద్ది రోజుల వ్యవధిలో వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనల వెనుక విషప్రయోగం ఉందా? ఉంటే ఆ దారుణానికి పాల్పడింది ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికులను వెంటాడుతున్నాయి.
ఆగస్టు 7న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఓ కుక్క నోటి వద్ద ఆకుపచ్చని నురుగుతో మృతి చెంది కనిపించినట్లు జంతు సంరక్షణ సంస్థ తెలిపింది. మరుసటి రోజు మరో కుక్క ఇదే తరహా లక్షణాలతో మృతి చెందిందని పేర్కొంది. ఆగస్టు 9 నుంచి 11 మధ్య మరికొన్ని కుక్కలు అనుమానాస్పదంగా చనిపోగా, కొన్ని కనిపించకుండా పోయినట్లు స్థానికులు సంస్థ దృష్టికి తీసుకెళ్లారు.
ఆగస్టు 12న రోడ్ నంబర్–14లో సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసున్న కుక్క మృతదేహం లభించింది. దాని నోటి వద్ద ఆకుపచ్చని నురుగు ఉండటంతోపాటు సమీపంలో చికెన్ ముక్క కనిపించడంతో ఆహారంలో విషం కలిపి ఉండవచ్చనే అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆగస్టు 14న మరో కుక్క మృతి చెందగా, దాని మృతదేహాన్ని వెంటనే తొలగించడంతో పోస్టుమార్టం నిర్వహించే అవకాశం లేకుండా పోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై ‘అరుద్ర ఫర్ యానిమల్స్ ఫౌండేషన్’ ఆగస్టు 12న మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు BNS సెక్షన్ 325తోపాటు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 11 కింద FIR నమోదు చేసినట్లు సమాచారం. పార్కు, రోడ్ నంబర్–14తోపాటు పరిసర వీధుల్లోని CCTV దృశ్యాలను వెంటనే భద్రపరిచి పరిశీలించాలని సంస్థ డిమాండ్ చేసింది.
అయితే కుక్కల మృతికి విషప్రయోగమే కారణమని ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. పోస్టుమార్టం, టాక్సికాలజీ నివేదికలు బయటకు రాలేదు. అనుమానితులను గుర్తించినట్లు కూడా సమాచారం లేదు. సాక్ష్యాలు కనుమరుగయ్యేలోపే పోలీసులు విచారణ వేగవంతం చేసి నిజానిజాలను బయటపెట్టాలి. లేకపోతే దీప్తిశ్రీనగర్‌లో మూగజీవాల వరుస మరణాల వెనుక ఉన్న మిస్టరీ అలాగే మిగిలిపోయే ప్రమాదం ఉంది.