- హైదరాబాద్–కరీంనగర్ టికెట్ రూ.290 నుంచి రూ.400కు పెంపు
- పండుగ రద్దీని ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారంటూ ప్రయాణికుల ఆగ్రహం
- బస్సు ఎక్కిన తర్వాత అధిక చార్జీ చెబుతున్నారని ఆరోపణ
- అదనపు బస్సులు నడపాల్సిన ప్రభుత్వ సంస్థే ధరలు పెంచితే ఎలా అంటూ ప్రశ్న
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్ : ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు పండుగల సమయంలో టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నారని విమర్శించే తెలంగాణ ఆర్టీసీ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తోందా? రాఖీ పండుగ సందర్భంగా నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారన్న ప్రయాణికుల ఆరోపణలు ఈ ప్రశ్నను తెరపైకి తెస్తున్నాయి.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రూ.290గా ఉన్న బస్సు టికెట్ ధరను రాఖీ పండుగ రోజు రూ.400కు పెంచినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. అంటే ఒక్కో ప్రయాణికుడిపై రూ.110 అదనపు భారం పడుతోంది. కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి సొంతూళ్లకు వెళ్లే సమయంలో ఇలా చార్జీలు పెంచడం ఏమిటని వారు మండిపడుతున్నారు.
పండుగల సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరగడం సహజం. ఈ రద్దీకి తగినట్లుగా అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ రవాణా సంస్థపై ఉంటుంది. కానీ అదనపు బస్సులు నడుపుతున్నామనే పేరుతో ప్రజలపైనే అదనపు భారం మోపడం సమంజసం కాదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా కొన్ని స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కే సమయంలో టికెట్ ధరను స్పష్టంగా చెప్పకుండా, మార్గమధ్యంలో టికెట్ తీసేటప్పుడు అధిక చార్జీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పటికే బస్సు బయలుదేరడంతో ప్రయాణికులు చేసేదేమీ లేక కండక్టర్ చెప్పిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
‘1:50 రూల్’ పేరుతో సాధారణ ధర కంటే రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ధరల పెంపునకు సంబంధించిన నిబంధనలు ఏమిటి? స్పెషల్ బస్సుల్లో ఎంత అదనపు చార్జీ వసూలు చేయవచ్చు? అనే విషయాలను టీజీఎస్‌ఆర్టీసీ ముందుగానే ప్రజలకు ఎందుకు వెల్లడించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రైవేటు బస్సులు పండుగ రద్దీని క్యాష్ చేసుకుంటే చర్యలు తీసుకోవాలని చెప్పే అధికారులు, ప్రభుత్వ ఆర్టీసీలోనే చార్జీలు పెరిగితే ఎలా సమర్థిస్తారని ప్రయాణికులు నిలదీస్తున్నారు. పండుగ ప్రయాణాన్ని సామాన్యుడికి అందుబాటులో ఉంచాల్సిన ఆర్టీసీ, ఆదాయమే లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజా రవాణాపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
స్పెషల్ బస్సుల చార్జీలపై టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టమైన ప్రకటన చేయాలని, బస్సు ఎక్కే ముందే టికెట్ ధర కనిపించేలా ప్రదర్శించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంతోపాటు, మార్గమధ్యంలో ధరలు చెప్పి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే విధానానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.