- శేరిలింగంపల్లిలో 2,73,486 మంది ఓటర్లకు నోటీసులు
- హియరింగ్‌కు హాజరై ఆధారాలు సమర్పించాలంటున్న అధికారులు
- గైర్హాజరైతే ఓటు తొలగించే అవకాశం.. ఓటర్లలో ఆందోళన
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : నియోజకవర్గంలో లక్షల మంది ఓటర్ల భవితవ్యం ఇప్పుడు అధికారుల హియరింగ్‌పై ఆధారపడింది. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ కాని 2,73,486 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న వారు నిర్దేశించిన తేదీన సంబంధిత కార్యాలయంలో హాజరై అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 639 పోలింగ్ బూత్‌ల పరిధిలో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. నోటీసుల్లో పేర్కొన్న సమయానికి జోనల్, సర్కిల్ లేదా వార్డు కార్యాలయాల్లో జరిగే హియరింగ్‌కు ఓటర్లు హాజరుకావాలి. ఆధార్, చిరునామా, వయస్సు, కుటుంబ సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ పత్రాలు అప్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే సర్ ప్రక్రియ ప్రారంభం నుంచే జాప్యం జరగడం, ఎన్యుమరేషన్ ఫారాలు సకాలంలో అందకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం ఇప్పుడు ఓటర్లను కలవరపెడుతోంది. నోటీసు అందకపోయినా, హియరింగ్ సమాచారం తెలియకపోయినా సామాన్యుడి ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
హియరింగ్‌కు హాజరుకాని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరూ అప్రమత్తంగా ఉండాలి. అదే సమయంలో నోటీసుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే. లక్షల మంది ఓట్లకు సంబంధించిన ప్రక్రియను మొక్కుబడిగా నిర్వహిస్తే రాజకీయ వివాదాలకు దారితీసే ప్రమాదముంది. ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది.