- ఫ్రిజ్‌లో చెలరేగిన మంటలు.. ఇంట్లోని సామగ్రికి వ్యాప్తి
- సంఘటనా స్థలానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకుడు గుండ్ల మహేందర్‌రెడ్డి
- సకాలంలో మంటలు అదుపు చేయడంతో తప్పిన భారీ ఆస్తినష్టం
సామాన్యుడి అస్త్రం / బాలాజీ నగర్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమీన్పూర్ సర్కిల్, బొల్లారం డివిజన్–272 పరిధిలోని బాలాజీ నగర్‌లో బుధవారం అగ్నిప్రమాదం కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఫ్రిజ్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగి, సమీపంలోని గృహోపకరణాలు, సామగ్రికి వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
తాళం వేసిన ఇంట్లో దట్టమైన పొగ
బాలాజీ నగర్‌కు చెందిన రాంప్రసాద్–మానస దంపతులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఫ్రిజ్ వద్ద మొదలైనట్లు భావిస్తున్న మంటలు క్రమంగా ఇంట్లోని సామగ్రికి వ్యాపించడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇంటి నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై సమాచారమిచ్చారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమా, ఫ్రిజ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపమా అనే విషయం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

మంటల్లోకి దూసుకెళ్లిన మహేందర్‌రెడ్డి
సమాచారం అందుకున్న స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండ్ల మహేందర్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన పొగతో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ, స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం మంటలు అంటుకున్న ఫ్రిజ్‌ను ఇంటి బయటకు తీసుకురావడంతో అగ్ని కీలలు ఇతర గదులకు విస్తరించకుండా అడ్డుకోగలిగారు. ప్రమాద సమయాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోకుండా వెంటనే అత్యవసర సేవలకు సమాచారమిచ్చి, సాధ్యమైన మేరకు బాధితులకు సహకరించాలని మహేందర్‌రెడ్డి సూచించారు. అయితే శిక్షణ లేకుండా మంటలు వ్యాపించిన భవనంలోకి ప్రవేశించడం ప్రమాదకరమని, ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేసి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో స్పందించి ప్రమాద తీవ్రతను తగ్గించిన మహేందర్‌రెడ్డిని స్థానికులు అభినందించారు.