Telangana

నొప్పికి మాత్రలే పరిష్కారం కాదు! సమన్వయ చికిత్సతోనే మెరుగైన ఫలితాలు

నొప్పికి మాత్రలే పరిష్కారం కాదు!  సమన్వయ చికిత్సతోనే మెరుగైన ఫలితాలు
  • మాదాపూర్‌లో ఐఏపీడబ్ల్యూసీ సౌత్‌ జోన్‌ సింపోజియం
  • ఆరు రాష్ట్రాల నుంచి హాజరైన వైద్య నిపుణులు, ఫిజియోథెరపిస్టులు
  • నొప్పి నియంత్రణలో ఫిజియోథెరపీ, పునరావాస చికిత్సకు కీలక ప్రాధాన్యం
సామాన్యుడి అస్త్రం / మాదాపూర్‌ : నొప్పి వచ్చిన ప్రతిసారీ మాత్ర వేసుకోవడమే పరిష్కారం కాదని, సమస్యకు మూలకారణాన్ని గుర్తించి వివిధ వైద్య విభాగాల సమన్వయంతో చికిత్స అందించినప్పుడే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. నొప్పి నిర్వహణలో ఆధునిక, బహుశాఖాపరమైన చికిత్సా విధానాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఐఏపీ ఉమెన్‌ సెల్‌ సౌత్‌ జోన్‌ ఆధ్వర్యంలో “పెయిన్‌ మేనేజ్‌మెంట్‌–ఎ మల్టీడిసిప్లినరీ అప్రోచ్‌” అంశంపై మాదాపూర్‌ హైటెక్‌ సిటీలోని సింధు హాస్పిటల్స్‌లో సింపోజియం నిర్వహించారు. వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, అధ్యాపకులు, వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు కలిపి సుమారు 350 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్స్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజీవ్‌ ఎస్‌.రావు, ఐఏపీ ఉమెన్‌ సెల్‌ నేషనల్‌ హెడ్‌, ఐఏపీ ట్రెజరర్‌ డాక్టర్‌ రుచి వర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింధు హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సోమరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్‌ ఆంటోనీ లాజర్‌ బాసిల్‌ సైతం పాల్గొని నొప్పి నిర్వహణలో సమగ్ర వైద్య విధానాల అవసరాన్ని వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఐఏపీడబ్ల్యూసీ సౌత్‌ జోన్‌ బృందాలు సింపోజియంలో పాల్గొన్నాయి. దీర్ఘకాలిక నొప్పులు, శస్త్రచికిత్స అనంతర పునరావాసం, శరీర కదలికల మెరుగుదల, సాధారణ జీవనానికి తిరిగి చేరుకునే ప్రక్రియతోపాటు ఆధునిక చికిత్సా విధానాలపై విస్తృతంగా చర్చించారు.
నొప్పిని తాత్కాలికంగా తగ్గించడమే లక్ష్యంగా కాకుండా, రోగి శారీరక సామర్థ్యాన్ని తిరిగి పెంచేలా చికిత్స ఉండాలని నిపుణులు పేర్కొన్నారు. ఫిజియోథెరపీ, పునరావాస వైద్యం, ఆర్థోపెడిక్స్‌, అనస్థీషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తే రోగులకు సమగ్ర వైద్యసేవలు అందుతాయని వివరించారు. ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితిని విడివిడిగా పరిశీలించి, అందుకు అనుగుణమైన చికిత్సా ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో డాక్టర్‌ నందకిశోర్‌, డాక్టర్‌ విజయ్‌ భటినా, డాక్టర్‌ హరలక్ష్మి, డాక్టర్‌ శివజ్యోతి, కేర్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ హరికుమార్‌ తాడి, యశోద హాస్పిటల్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ రాజేష్‌రెడ్డి, నిమ్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ సునీల్‌ వాసు, జోగో ఉమెన్స్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ ఉమా వెంకటేష్‌ పాల్గొన్నారు.
సింధు హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రైన్‌బో హాస్పిటల్స్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఉదితా ముఖర్జీ, ఏఐఎన్‌యూ యూరోగైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సారిక, సింధు హాస్పిటల్స్‌ ఫిజియోథెరపీ విభాగాధిపతి డాక్టర్‌ శ్రీనివాస్‌ బండారు, డాక్టర్‌ సాయి ఆదిత్య, సీనియర్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ సాయి జయకృష్ణ, డాక్టర్‌ సనా తరన్నుమ్‌తోపాటు పలువురు వైద్య నిపుణులు హాజరయ్యారు.
ఐఏపీడబ్ల్యూసీ తెలంగాణ టీమ్‌ హెడ్‌ డాక్టర్‌ మాధురి కాసి, డాక్టర్‌ వినోద్‌ వున్నం, డాక్టర్‌ శ్రీనివాస్‌ బండారు, ఇతర నిర్వహణ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
నొప్పి నియంత్రణ, పునరావాసం, శరీర కదలికలు, క్రియాశీల సామర్థ్యం, జీవన నాణ్యతను మెరుగుపరచడంలో ఫిజియోథెరపీకి ఉన్న ప్రాధాన్యాన్ని ఈ సింపోజియం చాటిచెప్పిందని నిర్వాహకులు తెలిపారు. వరల్డ్‌ ఫిజియోథెరపీ ఏషియా వెస్ట్రన్‌ పసిఫిక్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌–2026కు సౌత్‌ జోన్‌ తరఫున ఈ కార్యక్రమం ముఖ్యమైన అకాడమిక్‌ సహకారంగా నిలిచిందని పేర్కొన్నారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder