- రేవతి పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థికి అరుదైన అవకాశం
- బ్యాటింగ్ ప్రతిభతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఎండీ అసద్
- త్వరలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం
సామాన్యుడి అస్త్రం / శంకర్‌పల్లి : బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే పరుగులే లక్ష్యంగా దూసుకెళ్తున్న శంకర్‌పల్లి విద్యార్థి ఎండీ అసద్ ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తా చాటిన అసద్, చేవెళ్ల జోన్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.
శంకర్‌పల్లిలోని రేవతి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అసద్ తన బ్యాటింగ్ ప్రతిభతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడని పాఠశాల గేమ్స్ ఇన్‌చార్జి అరుంధతి ప్రకటించారు. చేవెళ్ల జోన్ జట్టులో చోటు కోసం శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పోటీ పడగా, అసద్ అత్యుత్తమ ప్రదర్శనతో ఎంపికయ్యాడని తెలిపారు.
చేవెళ్ల జోన్ తరఫున అసద్ త్వరలో జరగనున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న అసద్, సాధనను కొనసాగిస్తూ తన బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడుతున్నాడని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
అసద్ శంకర్‌పల్లి ప్రెస్‌క్లబ్ కార్యదర్శి ఎండీ జీలాని పాషా కుమారుడు. జోన్ జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని అసద్ తెలిపాడు. భవిష్యత్తులో మరింత కష్టపడి రాణించి తల్లిదండ్రులు, పాఠశాల, శంకర్‌పల్లి ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తానని చెప్పాడు. జిల్లా స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచి తదుపరి స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.
అసద్ ఎంపికపై టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎండీ సలీమ్ పాషా, రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు కొండా విజయ్‌కుమార్‌తోపాటు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి టోర్నమెంట్‌లోనూ అసద్ సత్తా చాటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.